ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్​ టౌన్, వెలుగు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నవంబర్ 12న మెదక్​ జిల్లా కోర్టు కాంప్లెక్స్​లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు.  సోమవారం జిల్లా కోర్టు సముదాయంలో లాయర్లు, బ్యాంకు స్టాండింగ్ కౌన్సిల్స్,  ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండింగ్ కౌన్సిల్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇన్సూరెన్స్, బ్యాంకు అధికారులు లోక్ అదాలత్​ను వినియోగించుకునేలా చూడాలని సూచించారు. ఈ విషయంలో  కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ మార్గం అనుసరించాలన్నారు.  సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, ఇన్సూరెన్స్, బ్యాంకు అధికారులు, లాయర్లు పాల్గొన్నారు.

కాలనీకి పోలీస్ రాములు పేరు 
మెదక్ (రేగోడ్​), వెలుగు: మెదక్​ జిల్లా రేగోడ్ మండలం పోచారం గ్రామానికి చెందిన పోలీస్ అమరవీరుడు ఎం.రాములు సేవలకు గుర్తింపుగా గ్రామంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీకి ఆయన పేరు పెట్టారు. సోమవారం మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో 'పోలీస్ రాములు కాలనీ'గా పేరు పెట్ఇ పూజలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాములు వీరమరణం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. అంతకుముందు రేగోడు మండల కేంద్రంలో పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్రీ మెడికల్​ క్యాంప్​ను ప్రారంభించారు. కార్యక్రమంలో 
అల్లాదుర్గం సీఐ జార్జ్, రేగోడు ఎస్సై  సత్యనారాయణ, పోచారం సర్పంచ్ సునీల్ కుమార్  పాల్గొన్నారు.


డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రమాదవశాత్తు డ్రైనేజీలో జారి పడి ఓ వ్యక్తి చనిపోయాడు. రూరల్​పోలీసుల వివరాల ప్రకారం.. రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన ఏర్పుల రాజయ్య (48) వ్యవసాయంతోపాటు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజులాగే టీ తాగడానికి బయటికి వెళ్లిన రాజయ్య మూత్ర విసర్జనకు డ్రైనేజీ వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడ్డాడు. తలకు తీవ్ర గాయమవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

ప్రధానికి  కోటి ఉత్తరాలు
సిద్దిపేట రూరల్, వెలుగు: కుల గణనతోనే సామాజిక న్యాయం జరుగుతుందని,  జనాభా సెన్సెస్ లో బీసీల అంశాన్ని చేర్చాలని కోరుతూ  ప్రధానికి  కోటి ఉత్తరాల కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ పరికిపండ్ల అశోక్ తెలిపారు. దేశ వ్యాప్త కోటి ఉత్తరాల ఉద్యమంలో భాగంగా సోమవారం సిద్దిపేటలో బీసీ సెల్ కో ఆర్డినేటర్ ముదిగొండ శ్రీనివాస్ అధ్యక్షతన ఆదర్శ చేనేత సొసైటీలోని చేనేత కార్మికులు, ప్రజలు, స్థానికులతో ప్రధానికి ఉత్తరాలు రాయించి పోస్ట్ డబ్బాలో వేయించారు. కార్యక్రమంలో పద్మశాలీ చేనేత సంఘల నేతలు పాల్గొన్నారు. 

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలి
సంగారెడ్డి టౌన్ , వెలుగు: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీపీటీఎఫ్​రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డిలోని టీచర్స్​భవన్​లో జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అశోక్​కుమార్​ మాట్లాడుతూ విద్యారంగంలో ఏడేండ్లుగా ప్రమోషన్లు, నాలుగేండ్లుగా బదిలీలు లేవన్నారు. దీంతో చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉందని, విద్యాప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. టీచర్ల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​చేశారు. సమావేశంలో లీడర్లు సంజీవయ్య, లక్ష్మయ్య యాదవ్, సోమశేఖర్ ,రాజారెడ్డి , సునీత, భాస్కర్, జనార్ధన్​రెడ్డి పాల్గొన్నారు. 

బిల్లుల పెండింగ్​పై  కౌన్సిలర్ల ఆగ్రహం 
కంది, వెలుగు : సంగారెడ్డి మున్సిపల్​ పరిధిలో చేపట్టిన డెవలప్​మెంట్​ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులలో ఆఫీసర్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్​అయ్యారు. రూలింగ్​ పార్టీ కౌన్సిలర్లకే దిక్కులేకుండా పోయిందని పలువురు కౌన్సిలర్లు ఆఫీసర్లపై అసహనం వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి మున్సిపల్​ ఆఫీసులో చైర్​పర్సన్​ విజయలక్ష్మీ అధ్యక్షతన మున్సిపల్​ మీటింగ్​జరిగింది. ఆఫీసర్లు ఎజెండా చదవడానికి ప్రయత్నించగా ముందు గత ఎజెండాలో చెప్పిన పనులపై మాట్లాడాలని కౌన్సిలర్లు డిమాండ్​ చేశారు. సమావేశంలో మున్సిపల్​ వైస్​ చైర్​పర్సన్​ లత, కమిషనర్​చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

ఎస్సీ ఇండ్లకు ఫ్రీ కరెంట్​ ఏదీ? 
రామాయంపేట, వెలుగు: ఎస్సీలకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, అధికారులు అమలు చేయడం లేదని కరెంట్ అధికారులపై రామాయంపేటలో ఎస్సీలు ఫైర్​అయ్యారు. సోమవారం బస్తీబాటలో భాగంగా మున్సిపల్ పాలకవర్గంతోపాటు అధికారులు స్థానిక ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీలో 230 కుటుంబాలు ఉండగా ఇందులో 70 శాతం మంది 60 యూనిట్లలోపే కరెంటు వాడుతారని, కానీ ఎవరికి ప్రభుత్వ సబ్సిడీ రావడం లేదని, బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తున్నారని విద్యుత్​ శాఖ ఏఈ పెంట్యానాయక్ పై మండిపడ్డారు. 

ట్రైనీ ఐఏఎస్​ టీం పర్యటన
కోహెడ, వెలుగు: హుస్నాబాద్, అక్కన్నపేట, బెజ్జంకి మండలాల్లో సోమవారం ట్రైనీ ఐఏఎస్​ల టీం పర్యటించింది. బెజ్జంకి మండలం రేగులపల్లి, అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామాల పంచాయతీలను సందర్శించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.

ట్రైనింగ్​లో క్షేత్ర స్థాయి పర్యటన కీలకం
సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐఏఎస్​ఆఫీసర్లకు క్షేత్రస్థాయి పర్యటన ఎంతో కీలకమని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారులు 19 మంది ట్రైనింగ్​లో భాగంగా వివిధ ప్రభుత్వ  పథకాలు, కార్యక్రమాల అమలుతీరు పరిశీలన కోసం సోమవారం సంగారెడ్డి జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్​లో కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్ ను ట్రైనీ ఆఫీసర్లు మర్యాదపూర్వకంగా కలిసారు. ట్రైనీ అధికారులు బృందాలుగా విడిపోయి సోమవారం నుంచి నవంబర్ 5వ తేదీ వరకు జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లోని పరిస్థితులను అధ్యయనం చేస్తారని  కలెక్టర్​ తెలిపారు.  

ప్రజావాణి ఫిర్యాదులకే ప్రయారిటీ ఇవ్వాలి
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు ప్రయారిటీ ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషినల్​కలెక్టర్ వీరారెడ్డి, డీఆర్వో రాధికారమణితో  కలిసి  వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన  అర్జీదారుల దరఖాస్తులను స్వీకరించారు. మొత్తంగా 45 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​ తెలిపారు. 

ప్రజా వినతులకు ప్రాధాన్యమివ్వాలి 
మెదక్​ టౌన్​, వెలుగు: ప్రజావాణిలో వచ్చే వినతులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరమే పరిష్కరించాలని మెదక్​ డీపీవో తరుణ్ కుమార్, సివిల్​సప్లై ఆఫీసర్​శ్రీనివాస్​ అన్నారు.  సోమవారం మెదక్​కలెక్టరేట్​లో ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రధానంగా భూమి పట్టా మార్పిడి, భూసర్వే , ధరణిలో మార్పులు, భూ సమస్యలు, పోడు  భూముల సమస్యలు, డబుల్​ఇండ్లు, పింఛన్లు మంజూరు చేయాలని అర్జీలు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. మొత్తం  63 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్య, హార్టీకల్చర్​ ఏడీ  నర్సయ్య, ఏడుపాయల ఈవో  శ్రీనివాస్, సీపీవో ఖాసిమ్​, డీఆర్డీవో ఏపీడీ  భీమయ్య, డీఎమ్​హెచ్​వో విజయనిర్మల  పాల్గొన్నారు. 

బాధితులకు న్యాయం చేయాలి 
మెదక్​ టౌన్​, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​స్టేషన్లలో సమస్యలను పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం ఎస్పీ ఆఫీసులో పోలీస్​ ప్రజావాణి నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుచి వచ్చిన బాధితుల సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత ఎస్​హెచ్​వోలకు ఆదేశాలు జారీ చేశారు. 

ఘనంగా ఏక్తాదివస్​
మెదక్​ టౌన్​, వెలుగు: సర్ధార్​వల్లభాయ్​ పటేల్ జయంతి సందర్భంగా మెదక్​ ఏక్తా దివస్​ఘనంగా నిర్వహించారు. మెదక్​ ఎస్పీ ఆఫీసులో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో  ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సర్దార్ పటేల్​ఫొటో వద్ద నివాళులర్పించారు. కలెక్టరేట్​లోని ప్రజావాణి హాల్​లో డీపీవో ఆధ్వర్యంలో అధికారులు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఇరిగేషన్​ఆఫీసులో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్​ ఆధ్వర్యంలో పటేల్ ఫొటోకు పూలమాలలతో నివాళులర్పించారు. 

కంది, వెలుగు : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని సోమవారం సంగారెడ్డిలో ఫోరమ్ ఫర్ బెటర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్​విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లీడర్లు శ్రీధర్ మహేంద్ర, సజ్జద్ ఖాన్, మహేశ్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

రాహుల్ జోడో యాత్రను సక్సెస్ చేయాలి:  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాశ్ రెడ్డి
కొండాపూర్, వెలుగు: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌‌ జోడో యాత్రను జిల్లాలో సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్‌‌ కార్యకర్తపై ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్​రెడ్డి అన్నారు. సోమవారం మల్కాపూర్‌‌లో ప్రైవేట్‌‌ ఫంక్షన్‌‌ హాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్‌‌ గాంధీ  చేపట్టిన యాత్ర దేశ రాజకీయాలను మారుస్తుందన్నారు.  ఈ నెల 3న సాయంత్రం కంది మండలం గణేశ్​గడ్డ నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందన్నారు. సుమారు 60 వేల మందితో  రాహుల్‌‌ గాంధీకి అపూర్వ స్వాగతం పలికి సంగారెడ్డి ప్రజల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. 20 ఏండ్ల నుంచి నా మీద ఎంతో ప్రేమతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమావేశానికి కాంగ్రెస్ నియోజకవర్గ లీడర్లు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అఖండ భారత్ రాహుల్ గాంధీ లక్ష్యం
నారాయణఖేడ్, వెలుగు: అఖండ భారత్ పునర్నిర్మాణమే రాహుల్ గాంధీ లక్ష్యమని టీపీసీసీ సభ్యుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ లో ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ నెల 6న నారాయణఖేడ్ నియోజకవర్గంలో భారత్ జోడో యాత్రను యువత, కార్యకర్తలు, అభిమానులు సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ లీడర్​ బోజిరెడ్డి, ఖేడ్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.

బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి:టీఎన్జీవో నాయకులు 
సిద్దిపేట రూరల్, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ రాష్ట్ర టీఎన్జీవోస్ కు బేషరతు క్షమాపణ చెప్పాలని  సంఘం జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రంరెడ్డి డిమాండ్​చేశారు. సోమవారం టీఎన్జీవో యూనియన్ పై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎన్జీవో సంఘం ఉద్యోగుల శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. టీఎన్జీవోలపై బండి సంజయ్​వ్యాఖ్యలు సరికాదన్నారు. ఉద్యోగులు ఏనాడు ప్రమోషన్ల కోసం పైరవీలు చేయలేదని తెలంగాణలో ఏ ఉద్యోగి కూడా అమ్ముడు పోలేదన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ లీడర్లు నిమ్మ సురేందర్ రెడ్డి, అశ్వక్ అహ్మద్, నర్సింలు, బాలరాజ్, సత్యనారాయణ, పాల్గొన్నారు.
మెదక్​ టౌన్​, వెలుగు:  బీజేపీ చీఫ్​బండి సంజయ్ మీడియా సమావేశంలో టీఎన్జీవో నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని మెదక్​ జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్​ దొంత నరేందర్​ డిమాండ్​చేశారు. సోమవారం మెదక్​లో టీఎన్జీవో నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. లంచ్​బ్రేక్​లో నిరసన తెలిపి, ధర్నా నిర్వహించారు. 

చేపలు పట్టేందుకు వెళ్లి.. వలలో చిక్కుకొని ఒకరు మృతి

మెదక్​ టౌన్, వెలుగు:  చేపలు పట్టేందుకు వెళ్లి వలలో చిక్కుకొని ఓ వ్యక్తి చనిపోయాడు. మెదక్​రూరల్​ఎస్ఐ మోహన్​రెడ్డి, కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. మెదక్​ మండలం పాతూరు గ్రామానికి చెందిన కట్ల రవి (35) సోమవారం చేపలు పట్టేందుకు గ్రామశివారులోని చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా వలలో చిక్కుకొని నీటిలో మునిగిపోయాడు. ఉదయం వెళ్లిన సాయంత్రమైనా రాకపోవడంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ రవి బట్టలు, చెప్పులు ఉన్నాయి. అనంతరం చెరువులో గాలించగా రవి డెడ్​బాడీ దొరికింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

మెదక్​లో ఆంక్షలు మెదక్​ టౌన్​,
 వెలుగు : శాంతి భద్రతల దృష్ట్యా నవంబరు 30 వరకు మెదక్​ జిల్లా వ్యాప్తంగా పోలీస్​ యాక్టు అమలులో ఉంటుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.  

వాటర్ ట్యాంక్​ ఎక్కిన స్కావెంజర్​
దుబ్బాక, వెలుగు: కుటుంబ పోషణ భారంగా మారి, పిల్లలకు నాణ్యమైన విద్యను అందించలేకపోతున్నానని మనస్థాపానికి గురైన ఓ స్కావెంజర్​ వాటర్​ట్యాంకు ఎక్కాడు. వివరాలిలా ఉన్నాయి.. దుబ్బాకకు చెందిన బిల్ల బాల్​రాజు పట్టణంలోని గవర్నమెంట్​ హైస్కూల్​లో స్కావెంజర్​గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వం ఇటీవల స్కావెంజర్లను విధుల నుంచి తొలగించింది. దీంతో కుటంబ పోషణ భారమై, చేతి నిండా పని దొరక్కపోవడంతో కుటుంబం పస్తులుండే పరిస్థితి నెలకొంది. ఒంటిపూట బడితో పిల్లలకు సరిగ్గా విద్య దొరకడం లేదని మనస్థాపానికి గురై సోమవారం వాటర్​ట్యాంక్​ఎక్కి సూసైడ్​చేసుకుంటానని చెప్పడంతో స్థానికులు వారించారు. ఎస్ఐ మహేందర్​ అక్కడికి చేరుకుని బాధితున్ని సముదాయించడంతో కిందకు దిగాడు. 

ఇందిరా గాంధీకి నివాళులు
ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నారాయణఖేడ్​ లోని కాంగ్రెస్​ పార్టీ ఆఫీసులో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ సురేశ్​షెట్కార్, ఇతర నాయకులు ఆమె ఫొటోకు నివాళులర్పించారు. ‌‌‌‌
- నారాయణఖేడ్​, వెలుగు