చిరాగ్‌‌ చెరగని ముద్ర.. 2020లో ఒక్క సీటు గెలిస్తే ఇప్పుడు 19 చోట్ల విజయం

చిరాగ్‌‌ చెరగని ముద్ర.. 2020లో ఒక్క సీటు గెలిస్తే ఇప్పుడు 19 చోట్ల విజయం

పాట్నా: బిహార్‌‌‌‌ ఎన్నికల్లో లోక్‌‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌‌ పాశ్వాన్‌‌) సత్తా చాటింది. ప్రధాని మోదీకి హనుమంతుడిగా చెప్పుకొనే ఆ పార్టీ చీఫ్​చిరాగ్‌‌ పాశ్వాన్‌‌ ఈ ఎన్నికల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన నేతృత్వంలో మొత్తం 28 స్థానాల్లో బరిలో నిలిచిన ఎల్జేపీ (ఆర్వీ) 19 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. 65 శాతం స్ట్రైక్​ రేట్‌‌తో దూసుకెళ్లింది. 

2020లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైన ఎల్జేపీ (ఆర్వీ).. ఇప్పుడు ఏకంగా 19 స్థానాలను కైవసం చేసుకొని.. ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా మారింది. ఒకప్పుడు తండ్రిని, తండ్రి స్థాపించిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్‌‌ పాశ్వాన్‌‌.. గత పార్లమెంట్‌‌ ఎన్నికలతోపాటు ఈ ఎలక్షన్స్‌‌లోనూ సత్తాచాటి ప్రభంజనం సృష్టించారు. ‘యువ బిహారీ’ అంటూ ప్రజలకు చేరువయ్యారు. కొద్ది ఏండ్లలోనే తనని తాను నిరూపించుకొని.. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు.

నాడు జేడీయూను వ్యతిరేకించి..

2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌‌ కుమార్​నాయకత్వాన్ని చిరాగ్‌‌ వ్యతిరేకించారు. ఆ ఎన్నికల్లో తన పార్టీ తరఫున137 సీట్లకు  అభ్యర్థులను నిలబెట్టారు. అయితే, ఒక్క సీటుకే ఎల్జేపీ (ఆర్వీ) పరిమితమైంది. అనంతరం తన బాబాయి పశుపతి కుమార్‌‌ పరాస్‌‌తో  విభేదాలు రాగా.. 2021లో ఎల్జేపీ(రాంవిలాస్‌‌) పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2024 లోక్‌‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి పోటీచేయగా.. 5 స్థానాల్లోనూ గెలుపొందారు. 100% స్ట్రైక్‌‌ రేటుతో సత్తాచాటారు. కేంద్ర ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ పరిశ్రమల శాఖ 
మంత్రిగా చిరాగ్‌‌ పాశ్వాన్‌‌ బాధ్యతలు చేపట్టారు.

సీఎంగా నితీశ్ కొనసాగుతరు..

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎంగా నితీశ్ కుమారే కొనసాగుతారని చిరాగ్ ప్రకటించారు. తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి వారి అహంకారమే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్డీయే భాగస్వాముల  ఐక్యతపై ప్రజల నమ్మకానికి ఈ ఘన విజయం నిదర్శనమని చెప్పారు.