మణిపూర్ హింసపై ..పార్లమెంట్​లో ఆగని రచ్చ

మణిపూర్ హింసపై ..పార్లమెంట్​లో ఆగని రచ్చ
  • రెండోరోజూ కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు 
  • ఉభయసభల్లో  గందరగోళం
  • ప్రతిపక్షాలే చర్చ జరగనివ్వడం లేదన్న రాజ్​నాథ్​సింగ్​

మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా తిప్పిన ఘటనపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి.  ‘మణిపూర్ రక్తమోడుతోంది’ అంటూ కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్, ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఆందోళన కొనసాగించారు.  స్పీకర్ పదేపదే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో శుక్రవారం కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్​సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. మరోవైపు,  మహిళలపై అఘాయిత్యాల్ని నిరసిస్తూ మణిపూర్​తోపాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. 

న్యూఢిల్లీ:  మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా తిప్పిన ఘటనపై పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ ప్రతిపక్షాల నిరసనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. శుక్రవారం కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే లోక్ సభ, రాజ్యసభ వాయిదాపడ్డాయి. ఉదయం లోక్ సభ మొదలుకాగానే కాంగ్రెస్, డీఎంకే, లెఫ్ట్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు ‘మణిపూర్ రక్తమోడుతోంది’ అంటూ నినాదాలు చేశారు. సీట్లలోంచి లేచి నిలబడి ఆందోళన కొనసాగించారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ.. సభలో చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని, నినాదాలు చేస్తూ సభను అడ్డుకోవడం సరికాదన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించడంతో గందరగోళం ఏర్పడింది. ‘‘మీరు సభ నడవకూడదని, క్వశ్చన్ హవర్ జరగకూడదని కోరుకుంటున్నారా? ఇతర సభ్యులంతా సభ సజావుగా నడవాలని ఆశిస్తున్నారు. 

ఇది సరైందికాదు. చర్చిస్తేనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది” అని స్పీకర్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే రక్షణ మంత్రి, లోక్ సభ డిప్యూటీ లీడర్ రాజ్​నాథ్ సింగ్ మాట్లాడారు. మణిపూర్ ఘటనలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే సభలో చర్చ జరగకుండా అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ విషయంపై ప్రతిపక్షాలే సీరియస్​గా లేవన్నారు. అయినా నిరసనలు కొనసాగడంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు మళ్లీ లేచి నిలబడి ప్లకార్డులు చూపుతూ నినాదాలు ప్రారంభించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. మణిపూర్​పై చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. కానీ అదే గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సోమవారానికి వాయిదా వేశారు.   

రాజ్యసభలోనూ అదే తీరు..  

మణిపూర్ ఘటనపై రాజ్యసభలోనూ శుక్రవారం ప్రతిపక్షాలు నిరసనలతో హోరెత్తించాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు లేచి నినాదాలు ప్రారంభించారు. గందరగోళం నెలకొనడంతో చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ సభను మధ్యాహ్నం 2.30కు వాయిదా వేశారు. మధ్యాహ్నం సమావేశాలు తిరిగి ప్రారంభం కాగానే.. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్​ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లును, ఫారెస్ట్ కన్సర్వేషన్ బిల్లును లిస్టింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల సభ్యులు ఆందోళనలు చేశారు. దీంతో పూర్తి గందరగోళం నెలకొనడంతో సభను చైర్మన్  సోమవారానికి వాయిదా వేశారు.  

రూల్ 176 కు కేంద్రం ఓకే..

మణిపూర్ ఘటనలపై పార్లమెంట్ లో రూల్ 176 కింద చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం మొదటి రోజు సమావేశాల నుంచే స్పష్టం చేస్తోంది. కానీ రూల్ 267 కిందే చర్చ చేపట్టాలంటూ ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి. అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం అదే తీరును కొనసాగించడంతో రెండ్రోజులుగా ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కు సంబంధించిన ఈ రెండు రూల్స్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. రూల్ 176 కింద ఏదైనా ఒక అంశంపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఉంటుంది. ఈ రూల్ కింద సుమారు అరగంట నుంచి గంటన్నర వరకు సభలో చర్చించవచ్చు. రాజ్యసభలో ఎవరైనా ఒక సభ్యుడు రూల్ 267 కింద చర్చకు నోటీసు ఇస్తే.. దానికి చైర్మన్ అనుమతి ఇస్తే.. మిగతా అన్ని ప్రొసీడింగ్స్ పక్కన పెట్టి ఆ అంశంపైనే సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంటుంది. అందుకే తాము రూల్ 267 కింద కూడా నోటీసు ఇచ్చామని, దీని కిందే చర్చ చేపట్టాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేస్తున్నారు.