గందరగోళం మధ్య బడ్జెట్​కు  లోక్​సభ ఆమోదం

గందరగోళం మధ్య బడ్జెట్​కు  లోక్​సభ ఆమోదం

న్యూఢిల్లీ: అదానీ ఇష్యూ, రాహుల్ కామెంట్లపై పార్లమెంట్ లో లొల్లి కొనసాగింది. దీంతో గురువారం కూడా ఎలాంటి చర్చ లేకుండానే లోక్ సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగా.. అదానీ ఇష్యూపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేయాలని, రాహుల్ గాంధీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. బెంచీలపై నిలబడి నిరసన తెలిపారు.

ఈ క్రమంలో కొంతమంది సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. మరోవైపు, రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. క్వశ్చన్ అవర్ తర్వాత మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ఓం బిర్లా చెప్పినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినిపించుకోలేదు. నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత సాయంత్రం 6 గంటలకు వాయిదా వేశారు.  ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. గందరగోళం మధ్యనే బడ్జెట్ కు, అప్రాప్రియేషన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. కాగా, సభ ప్రారంభంలో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు సభ్యులు నివాళి అర్పించారు. 

రాజ్యసభలోనూ అంతే.. 

రాజ్యసభలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య లొల్లి కొనసాగింది. రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ.. అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలంటూ కాంగ్రెస్ పట్టుబట్టాయి. దీంతో చైర్మన్ జగదీప్ ధన్​కర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనా  అధికార, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు కొనసాగించారు. గందరగోళం కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. 

ప్రతిపక్షాల ర్యాలీ... 

అదానీ ఇష్యూపై జేపీసీ వేయాలనే డిమాండ్​తో ప్రతిపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్​లో ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెయిన్ గేటు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్ చేపట్టాయి.