
న్యూఢిల్లీ: ఆరో విడత లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలయ్యింది. ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
బరిలో 889 మంది..
ఆరో ఫేజ్ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా 58 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ – రాజౌరీ సెగ్మెంట్‌కు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒడిశా, వెస్ట్ బెంగాల్‌లోని పలు అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనున్నది. ఆరో ఫేజ్‌లో మొత్తం 11.13 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఢిల్లీలో 7, బిహార్‌లో 8, యూపీలో 14, జమ్మూ కాశ్మీర్లో ఒకటి, హర్యానాలో 10, ఒడిశాలో 6, వెస్ట్ బెంగాల్లో 8, జార్ఖండ్‌లో 4 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఢిల్లీలోని 7 స్థానాలల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నది. కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేస్తున్నది. బీజేపీ మొత్తం ఏడు స్థానాల్లో బరిలో ఉన్నది. 2014, 2019లో ఢిల్లీలో జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురిని తప్పించి కొత్తవారికి చాన్స్ ఇచ్చింది. దీంతో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. మొత్తం 1.52 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
డ్రోన్లతో పోలింగ్ సరళి పరిశీలన
ఢిల్లీ వ్యాప్తంగా 2,627 చోట్ల 13వేల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఎన్నికలు అధికారులు ప్రకటించారు. 60 వేల మంది పోలీసులను మోహరించారు. డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఈసీ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. 44 నుంచి 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశాలు ఉండటంతో.. పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఢిల్లీ సీఈవో పి.కృష్ణమూర్తి తెలిపారు.