ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్

ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్ పోలింగ్
  • 13 రాష్ట్రాలు/యూటీల్లోని 89 ఎంపీ సీట్లకు పోలింగ్
  •  బీజేపీ, ఇండియా కూటమి​మధ్య టఫ్​ ఫైట్​
  •  అదృష్టాన్ని పరీక్షించుకోనున్న రాహుల్​గాంధీ, శశిథరూర్, హేమమాలిని, తేజస్వీ సూర్య సహా ప్రముఖులు

న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో  భాగంగా సెకండ్​ ఫేజ్​ పోలింగ్ కు దేశం సిద్ధమైంది. ఈ నెల 26 (శుక్రవారం)న రెండో విడతలో భాగంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్​ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్​ ఉదయం 7కు ప్రారంభమై సాయంత్రం 5కు ముగుస్తుంది. బిహార్, అస్సాంలో 5 చొప్పున, చత్తీస్​గఢ్​లో 3, కర్ణాటకలో 14, కేరళలో  20, మధ్యప్రదేశ్​లో 7, మహారాష్ట్ర, యూపీల్లో 8 చొప్పున, రాజస్థాన్​లో 13,  బెంగాల్​లో 3, జమ్ముకాశ్మీర్, త్రిపుర, లక్షద్వీప్​లో ఒక్కో నియోజకవర్గం, మణిపూర్​లో ఔటర్​ మణిపూర్​ నియోజకవర్గంలోని సగం పోలింగ్​స్టేషన్లలో ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, సెకండ్ ఫేజ్ లో ఎన్నికలు జరుగనున్న నియోజకవర్గాల్లో బుధవారం సాయంత్రం ప్రచారం ముగిసింది. 

ప్రముఖుల మధ్య పోటీ

రెండో దశ ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య టఫ్ ​ఫైట్​ జరుగనున్నది. కేరళలోని వయనాడ్​ నుంచి కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ, తిరువనంతపురం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి శశిథరూర్​, బీజేపీ నుంచి రాజీవ్​ చంద్రశేఖర్​, మథుర నుంచి హేమమాలిని, రాజ్​నంద్​గావ్​ నుంచి భూపేశ్​ బఘేల్​, బెంగళూరు రూరల్​ నుంచి డీకే సురేశ్​, బెంగళూరు సౌత్​ నుంచి తేజస్వీ సూర్య తదితరులు రెండో దశలో పోటీలో ఉన్నారు. మొదటి దశ పోలింగ్​ ఏప్రిల్​19న జరిగింది. 21 రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా,  65 శాతం ఓటింగ్​ నమోదైంది. 

నోయిడా రెస్టారెంట్లలో ‘డెమోక్రసీ డిస్కౌంట్’​

ఓటుహక్కు వినియోగించుకున్నవారికి యూపీ​లోని నోయిడాలో రెస్టారెంట్లు ‘డెమోక్రసీ డిస్కౌంట్’ ప్రకటించాయి. నోయిడా, గ్రేటర్​ నోయిడాలోని హోటల్స్​లో ఈ నెల26, 27వ తేదీల్లో 20 శాతం డిస్కౌంట్​ లభిస్తుందని యాజమాన్యాలు వెల్లడించాయి. వేలికి ఉన్న సిరాగుర్తు చూయించి, ఈ ఆఫర్​ను పొందొచ్చని తెలిపాయి. అలాగే, నోయిడాలోని పలు హాస్పిటల్స్​ కూడా ఓటేసి వచ్చిన వారికి రూ. 6,500 విలువైన ఫుల్​ బాడీ చెకప్​ను ఫ్రీగా అందిస్తామని  ప్రకటించాయి.  

కర్నాటకలో ర్యాపిడో ఫ్రీ

కర్ణాటకలో ఈ నెల 26న పోలింగ్​లో పాల్గొనేందుకు వెళ్తున్న సీనియర్​ సిటిజన్స్​, దివ్యాంగుల కోసం ఉచిత సేవలు అందిస్తున్నట్టు ర్యాపిడో ప్రకటించింది. ‘సవారీ జిమ్మేదారీ కీ’ ఇనీషియేటివ్​లో భాగంగా ఫ్రీ బైక్​ ట్యాక్సీ, ఆటో, క్యాబ్​ సేవలను ఉచితంగా అందిస్తున్నట్టు బుధవారం ఆ కంపెనీ వెల్లడించింది. బెంగళూరు, మైసూర్​, మంగళూరులోని దివ్యాంగులు, సీనియర్​ సిటిజన్లు ‘వోట్​ నౌ’ అనే కోడ్​ను ఉపయోగించి ఫ్రీ రైడ్​ చేయొచ్చని తెలిపింది.