2024 లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయ్.. లేకుంటే మోడీ ప్రధాని అయ్యేవారు కాదు: రాహుల్ గాంధీ

2024 లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయ్.. లేకుంటే మోడీ ప్రధాని అయ్యేవారు కాదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ విమర్శల దాడిని కంటిన్యూ చేస్తున్నారు. శనివారం (ఆగస్ట్ 2) ఢిల్లీలో ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ న్యాయ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్ జరిగాయని.. దీనిని నిరూపించేందుకు తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  భారతదేశంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలించాం. మొత్తం 6.5 లక్షల మంది ఓటర్లు ఉంటే అందులో 1.5 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.

ఈ మోసం వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. బీజేపీకి మరో 15-20 సీట్లు తక్కువగా వచ్చి ఉంటే మోడీ ప్రధాని అయ్యేవారు కాదని సంచలన వ్యా్ఖ్యలు చేశారు. భారతదేశంలో ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదని.. దేశంలో ఎలక్షన్ కమిషన్ చచ్చిపోయిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 2014 నుండే ఏదో తప్పు జరిగిందనే అనుమానం తనకు ఉందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని.. ఇది తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 

‘‘2024 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. లోక్ సభ ఎన్నికలు అయిపోయిన నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఇండియా కూటమి ఓటమి పాలైంది. అది ఓటమి కాదు.. మొత్తం తుడుచుకుపెట్టుకుపోవడం. ఈ ఘోర పరాజయం, నాలుగు నెలల్లోనే ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటనే దానిపై మేం ఆరా తీశాం. మా విచారణలో తేలిదేంటంటే మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నాలుగు నెలలలో గ్యాప్‎లో కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. ఆ ఓట్లలో ఎక్కువ భాగం బీజేపీకి వెళ్తాయి. ఇందుకు సంబంధించి మా అన్ని ఆధారాలు  ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.