లోక్‌సభ రికార్డ్.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 132శాతం ఉత్పాదకత

లోక్‌సభ రికార్డ్.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో 132శాతం ఉత్పాదకత

నాలుగు సమావేశాలతో కూడిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మొత్తం ఉత్పాదకత 132 శాతంగా నమోదైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 17వ లోక్‌సభ పదమూడవ సెషన్‌ సెప్టెంబర్‌ 18న ప్రారంభమైంది. దిగువ సభను వాయిదా వేయడానికి ముందు స్పీకర్ బిర్లా ఈ కామెంట్స్ చేశారు. "ఈ సెషన్‌లో కేంద్ర శాసనసభ కొత్త భవనం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించినందున ఈ సెషన్ పార్లమెంటరీ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనదిగా నమోదు చేయబడుతుంది" అని అన్నారు.

దాదాపు 31 గంటలపాటు ఈ సభ కొనసాగిందని, సభ్యుల ప్రత్యేక సమావేశాల సందర్భంగా దిగువ సభ నికర ఉత్పాదకత 132 శాతంగా ఉందని స్పీకర్ ఓం బిర్లా తెలియజేశారు. ఈ ప్రత్యేక సమావేశంలో ఒక ప్రభుత్వ బిల్లును ప్రవేశపెట్టగా, మరొకటి ఆమోదించబడిందని బిర్లా తెలియజేశారు. సెప్టెంబరు 19న ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ అనే రాజ్యాంగ (128వ సవరణ) బిల్లుపై 9 గంటల 57 నిమిషాల పాటు చర్చ జరిగిందని ఆయన సభకు తెలిపారు. "32 మంది మహిళా సభ్యులతో సహా మొత్తం 60 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఈ బిల్లు ఆమోదించబడింది" అని బిర్లా వివరించారు.

పార్లమెంటరీ యాత్రపై చర్చ:

75 ఏళ్ల పార్లమెంటరీ ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సంవిధాన్ సభ నుంచి ప్రారంభమైన చర్చ 6 గంటల 43 నిమిషాల పాటు సాగిందని బిర్లా తెలిపారు. ఈ చర్చలో 36 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. "సెప్టెంబర్ 21న, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. చంద్రయాన్-3 మిషన్ యొక్క విజయం, అంతరిక్ష పరిశోధనలో మన దేశం సాధించిన ఇతర విజయాలపై చర్చను ప్రారంభించారు. ఈ చర్చ 12 గంటల 25 నిమిషాల పాటు కొనసాగింది. 87 మంది సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు" అని స్పీకర్ తెలియజేశారు.

లోక్‌సభలోని డిపార్ట్‌మెంట్ సంబంధిత స్టాండింగ్ కమిటీలు ఈ సెషన్‌లో కూడా ఒక నివేదికను సమర్పించాయని, సెప్టెంబర్ 20, 2023న డైరెక్షన్ 73A కింద ఒక ప్రకటన కూడా చేశామని స్పీకర్ సభ దృష్టికి తీసుకువచ్చారు.

లోక్‌సభ టేబుల్‌పై ఎన్ని పేపర్లు పెట్టారు?

సభ టేబుల్‌పై 120 పేపర్లు ఉంచినట్లు స్పీకర్ లోక్‌సభ సభ్యులకు తెలియజేశారు.