లోకాయుక్తకు ఆ అధికారం లేదు.. రికవరీ ఉత్తర్వులపై హైకోర్టు

లోకాయుక్తకు ఆ అధికారం లేదు.. రికవరీ ఉత్తర్వులపై హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: భూ పరిహార చెల్లింపుల వ్యవహారంలో రికవరీ చేయాలని రెవెన్యూ ఆఫీసర్లకు లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. లోకాయుక్త యాక్ట్‌‌లోని 7, 9 సెక్షన్ల ప్రకారం అలాంటి అధికారం లోకాయుక్తకు లేదని తేల్చింది. ఈ మేరకు చీఫ్‌‌ జస్టిస్‌‌ లోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ ఎస్వీ శ్రవణ్‌‌ కుమార్‌‌‌‌ల డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల ఆదేశించింది. తోటపల్లి రిజర్వాయర్‌‌ నిమిత్తం చేపట్టిన భూ సేకరణలో చెల్లించిన పరిహారాన్ని లోకాయుక్త ఉత్తర్వుల మేరకు డిపాజిట్‌‌ చేయాలని హుస్నాబాద్‌‌ ఆర్డీవో ఇచ్చిన నోటీసును సవాల్‌‌ చేస్తూ ఎస్‌‌.కనకయ్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. లోకాయుక్తకు రికవరీ ఆదేశాలు జారీ చేసే అధికారం లేదని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.

ప్రతివాది గుడారం బాలవ్వ తరఫు లాయర్‌‌‌‌ వాదిస్తూ, పరిహారం కోసం లోకాయుక్తను ఆశ్రయించామని, అది ఇచ్చిన ఆదేశాల వల్ల నష్టమేమీ లేదన్నారు. ఒకరికి చెల్లించాల్సిన పరిహారం మరొకరికి చెల్లించడం వల్ల రికవరీ ఉత్తర్వులు వెలువరించిందని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, లోకాయుక్త యాక్ట్‌‌ ప్రకారం రికవరీ ఆదేశాలు జారీ చేసే పరిధిలో లేదని చెబుతూ, రిట్‌‌పై విచారణను క్లోజ్‌‌ చేసింది.