ఫెడరర్‌‌కు పోటీ ఇచ్చినా గుర్తింపు లేదు

ఫెడరర్‌‌కు పోటీ ఇచ్చినా గుర్తింపు లేదు

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అద్భుత ఆటతీరు కనబరుస్తున్నా తనకు మద్దతు లభించడం లేదని ఇండియా యువ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ సుమిత్‌‌ నగల్‌‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల యూఎస్‌‌ ఓపెన్‌‌లో లెజెండరీ ప్లేయర్‌‌ రోజర్‌‌ ఫెడరర్‌‌పై ఒక సెట్‌‌ కైవసం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే అర్జెంటీనాలో జరిగిన బ్యూనస్‌‌ ఏయిర్స్‌‌ టోర్నీని నెగ్గడంతోపాటు మరో చాలెంజర్‌‌ టోర్నీలో రన్నరప్‌‌గా నిలిచి నిలకడ కనబరుస్తున్నాడు. ఈక్రమంలో పురుషుల సింగిల్స్‌‌లో కెరీర్‌‌ బెస్ట్‌‌ 135వ ర్యాంక్​ దక్కించుకున్నాడు. కానీ, తనకు ఎవరూ అండగా నిలవడం లేదని నగల్​ వాపోయాడు. ‘నేను ఒంటరిగా పోరాడుతున్నా. ఎవరూ సాయం చేయడం లేదు. ఒకవైపు అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తున్న ఆనందం ఉన్నప్పటికీ దానికి తగిన మద్దతు లభించడం లేదు. 22 ఏళ్ల వయసులో యూఎస్‌‌  ఓపెన్‌‌కు క్వాలిఫై అయ్యి ఫెడరర్‌‌ను నిలువరించాను. అయినప్పటికీ నేను ఒంటరిగానే మిగిలా. ఈ ఫలితాలు టెన్నిస్‌‌పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. నాపై పెట్టుబడి పెట్టేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం బాధాకరం’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి కేంద్రం ప్రతిష్టాత్మక పథకం టాప్స్​ నుంచి గతంలో నగల్‌‌కు ఆర్థికసాయమందేది. అనంతరం నగల్‌‌తో సహా మిగతా సింగిల్స్‌‌ ప్లేయర్‌‌కు కూడా సాయాన్ని నిలిపేశారు. డబుల్స్‌‌లో మాత్రం రోహన్‌‌ బోపన్న, దివిజ్‌‌ శరణ్‌‌ ఆర్థిక సాయం అందిస్తున్నారు.