కవితను తెలంగాణ ఆడబిడ్డలా చూడండి: మంత్రి గంగుల

కవితను తెలంగాణ ఆడబిడ్డలా చూడండి: మంత్రి గంగుల

కరీంనగర్:  కవితను తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని మంత్రి గంగుల అన్నారు. నిన్న జరిగిన గొడవను  పార్టీల మధ్య గొడవగా చూడాలి.. కానీ కులాలకు అంటగట్టొద్దన్నారు. కరీంనగర్ రూరల్ మండలం  ఛామన్ పల్లి రాజసముద్రం చెరువుకు నీటిని తరలించేందుకు  డి-87 కెనాల్ వద్ద నిర్మించిన ఫీడర్ ఛానల్ కాలువకు మంత్రి గంగుల భూమి పూజ చేశారు. ఈ పనులు 20 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 65 లక్షలతో నిర్మించిన ఈ ఫీడర్ ఛానల్ ద్వారా కాళేశ్వరం జలాలు రాజసముద్రం చెరువులోకి వస్తాయని మంత్రి గంగుల తెలిపారు. అలాగే కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో గర్భిణులను పరీక్షించే  టిఫ్పా స్కానర్ ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ నిన్న ఎంపీ అర్వింద్, ఎమ్మెల్సీ కవితల మధ్య జరిగిన గొడవపై స్పందించారు. అర్వింద్ పై దాడిని మున్నూరు కాపులపై దాడిగా కొన్ని సంఘాలు చెప్పడం సరికాదన్నారు. మున్నూరు కాపు సోదరులందరూ కుల బలోపేతం కోసం పనిచేయాలని సూచించారు. కులానికి రాజకీయ జోక్యం అవసరం లేదని, అన్ని పార్టీల్లో అన్ని కులాలుంటాయని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. మున్నూరు కాపు సంఘాల్లో అన్ని పార్టీల వారుంటారని గుర్తు చేశారు.

పార్లమెంట్ సభ్యునిగా ఉన్న ఆర్వింద్ హుందాగా మాట్లాడాలన్నారు. నీ ద్వారా ఓ పదిమంది నేర్చుకుని నిన్ను వారు అనసరించేలా నీ తీరు ఉండాలన్నారు. ఆడబిడ్డ పట్ల వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్న మంత్రి గంగుల కమలాకర్ రాజకీయ విబేధాలుంటే స్మూత్ గా డీల్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా సరే ప్రజలు హర్శించే విధంగా ఉండాలంటూ  ఆడబిడ్డ మీద అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.