
షెల్ కంపెనీల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించినట్టు నమోదైన కేసులో దివాన్ హౌసింగ్ పైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) ప్రమోటర్లను ప్రశ్నించడానికి కేంద్ర హోంశాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. షెల్ కంపెనీల వ్యవహారంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లపై దాదాపు 20 కేసులు నమోదయ్యాయి. దీంతో వీళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ మాదిరే విదేశాలకు పారిపోయే అవకాశాలు ఉండటంతో నోటీసులు జారీ అయినట్టు సమాచారం. మరోవైపు రేటింగ్ కంపెనీలు కూడా డీహెచ్‌ఎఫ్‌ఎల్ రేటింగ్‌కు కోతపెట్టాయి. దీంతో కొత్త డిపాజిట్లను తీసుకోవడం లేదని, గడువు తీరని డిపాజిట్లకు చెల్లింపులను ఆపేశామని కంపెనీ ప్రకటించింది. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయనే వార్తలు రావడంతో కంపెనీ షేరు మంగళవారం రూ.4.32 నష్టపోయి రూ.114లకు దిగివచ్చింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్ పెట్టినవన్నీ షెల్ కంపెనీలేనని, గ్రూపు కంపెనీల చిరునామాలు కూడా అస్తవ్యస్థంగా ఉన్నాయని ఎంసీఏ గుర్తించింది.
నోటీసులు రాలేదన్న డీహెచ్‌ఎఫ్‌ఎల్
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్ల ఆచూకీ కోసం లుకౌట్ నోటీసులు జారీ అయినట్టు వచ్చిన వార్తలను కంపెనీ తోసిపుచ్చింది. ఈ విషయమై ప్రమోటర్‌కు గానీ డైరెక్టర్లకు గానీ ఎలాంటి సమాచారమూ అందలేదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం తమ దృష్టంతా వ్యాపారాన్ని బలోపేతం చేయడం, గడువు ప్రకారం చెల్లింపులు జరపడంపైనే ఉందని తెలిపింది. ఇందుకోసం వ్యూహాత్మక భాగస్వామి కోసం వెతుకుతున్నట్టు తెలిపింది. షెల్ కంపెనీలను ఏర్పాటు చేయలేదని స్పష్టీకరించింది.
వివాదం ఏమిటంటే..
డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆస్తుల కొన్నారని కొన్ని నెలల క్రితం కోబ్రాపోస్ట్ రాసిన కథనం సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కథనం ప్రకారం.. డీహెచ్‌ఎఫ్‌ఎల్ దాదాపు రూ.31 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది. కంపెనీ ప్రమోటర్లు పథకం ప్రకారం మహారాష్ట్రలో మురికివాడల అభివృద్ధి పేరుతో షెల్ (డొల్ల) కంపెనీలను ఏర్పాటు చేశారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ అక్రమపద్ధతిలో వాటికి రుణాలు, గ్రాంట్ల రూపంలో వేలాది కోట్ల రూపాయలను అందించింది. కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్ తదితరులు ఒకే అడ్రస్‌తో ఉన్న అనేక షెల్ కంపెనీలను ప్రారంభించారు. ఇలా కేవలం రూ.లక్ష లోపు వ్యయంతో ఏర్పాటు చేసినవి దాదాపు 45 కంపెనీలు ఉన్నాయి. ఇందులో 34 సంస్థలతో వాద్వాన్ కుటుంబానికి సంబంధం ఉన్నట్టు తేలింది. రూ.21,477 కోట్లను వివిధ షెల్ కంపెనీలకు రుణాలుగా, పెట్టుబడులుగా అందించారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్ అనుబంధ కంపెనీలకు రూ.31 వేల కోట్లు చెల్లించారు. షెల్ కంపెనీలకు తరలించిన సొమ్మును దేశం దాటించిన ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, అరుణా వాద్వాన్, ధీరజ్ వాద్వాన్ సహా పలువురు ఇంగ్లండ్, దుబాయి, శ్రీలంక, మారిషస్ దేశాల్లో వ్యక్తిగతంగా ఆస్తులు కూడబెట్టారు. వివిధ రూపాల్లో ఈ సొమ్మును తిరిగి ఇండియాకు రప్పించి ఇక్కడ కూడా షేర్లు, ఆస్తులను కొనుగోలు చేశారని కోబ్రాపోస్ట్ వెల్లడించింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాకుండా చూసేందుకు బీజేపీకి కోట్ల రూపాయల చందాలు ఇచ్చిందని కూడా ఆరోపించింది. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.