
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో గర్భిణులకు అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రూల్స్ పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై విచారణ చేపట్టినా చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్య శాఖ జాప్యం చేస్తోంది. ఇందుకు అధికార పార్టీ లీడర్ల ఒత్తిడులే కారణంగా తెలుస్తోంది.
95 శాతం కోతలే..
నిజామాబాద్ జిల్లాలో 150 వరకు గైనిక్ ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో చాలా హాస్పిటళ్లలో సిజేరియన్లపై ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు. పుట్టగొడుగుల్లా ఆస్పత్రుల్లో డబ్బులకు ఆశపడి అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుకు సుమారు 300 మంది గర్భిణులు ప్రసవాలకు వస్తుండగా ఇందులో 285 మందికి (95 శాతం) సిజేరియన్లు జరుగుతున్నాయి. డెలివరీ చార్జీల కింద హాస్పిటల్ స్థాయిని బట్టి రూ.15 వేల నుంచి రూ.25 వేలు వసూలు చేస్తున్నారు. మెడిసిన్, అనస్తీషియా డాక్టర్ చార్జీలు అదనం. ఇక బిడ్డ ఆరోగ్యస్థితిని బట్టి ఇంక్యూబెటర్‌కు రిఫెర్ చేసి కూడా బిల్లులు గుంజుతున్నారు.
ప్రైవేట్‌పై వేటు పడేనా ?
కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలతో జూన్ 28 నుంచి జులై 7వ తేదీ వరకు ప్రైవేట్ హాస్పిటళ్లలో జరిగిన సిజేరియన్లపై విచారణ చేపట్టారు. 8 తనిఖీ బృందాలు రంగంలోకి దిగాయి. ఒక్కో బృందంలో ముగ్గురు అధికారుల చొప్పున నిజామాబాద్, బోధన్, ఆర్మూర్‌లోని గైనిక్ ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. అనేక ఆస్ప త్రుల్లో సరిపడా డాక్టర్లు, లేబర్ రూంలు, బయో మెడికల్ వేస్టేజ్, సిబ్బంది లేరని గుర్తించారు. నివేదిక తయారు చేసి కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు అందించారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని 37, బోధన్‌లో 8, ఆర్మూర్‌లో 9 మొత్తం 54 ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులకు 5 రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉన్నా.. 22 రోజులైనా హాస్పి టళ్ల యాజమాన్యాల నుంచి స్పందన లేదు. వీరికి అధికార పార్టీ లీడర్ల అండ ఉన్నట్లు తెలుస్తోంది. లీడర్లు ప్రమేయంతోనే ఆఫీసర్లు కూడా చర్యలకు దిగడంలేదనే ప్రచారం జరుగుతోంది. గతంలో కొవిడ్ టైంలో కూడా పేషెంట్ల నుంచి అధికంగా వసూలు చేసిన ఫీజులను వాపసు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పును సైతం కొన్ని దవాఖానాలు లెక్క చేయడం లేదు. ఇప్పటి వరకు ఆ సొమ్మును పేషెంట్లకు రిటర్న్ ఇవ్వలేదని తెలిసింది.
చర్యలు తీసుకోవాలి
నగరంలోని పలు ప్రైవేట్ హాస్పిటళ్లలో అవసరం లేకున్నా సిజేరియన్లు చేస్తున్నరు. చార్జీల పేరు పేషెంట్ల నుంచి వేల రూపాయలు గుంజుతున్నరు. కొన్ని ఆస్పత్రులపై విచారణ జరిపి 22 రోజులైతున్నా ఇంకా చర్యలు తీసుకోవడం లేదు.
- పంచారెడ్డి ప్రవళిక, కార్పొరేటర్
చర్యలు తప్పవు
కలెక్టర్ ఆదేశాలతో స్పెషల్ టీమ్‌తో హాస్పిటళ్లలో తనిఖీలు చేపట్టాం. జిల్లాలో ఇప్పటి వరకు 54 దవాఖానాలకు నోటీసులు ఇచ్చాం. వాటికి ఆయా యాజమాన్యాలు వివరణ ఇవ్వాల్సిఉంది. రూల్స్ పాటించని హాస్పిటళ్లపై కచ్చితంగా చర్యలు ఉంటాయి.
- డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్