- ఐదో రోజు శ్రీకృష్ణ అలంకారం, పొన్నవాహన సేవ
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు స్వామివారికి శ్రీకృష్ణావతార అలంకార సేవ, పొన్నవాహన సేవ ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల అర్చకత్వంలో అర్చకులు, యజ్ఞాచార్యులు, పారాయణికులు ఈ సేవలను నిర్వహించారు. ఉదయం 9 గంటలకు స్వామివారిని శ్రీకృష్ణుడి(మురళీకృష్ణుడు)గా అలంకరించారు. ఆ తరువాత ఆలయ తిరువీధుల్లో తిప్పారు.
రాత్రి స్వామివారిని లక్ష్మీ సమేతంగా పొన్నవాహనంపై ఉంచి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం తూర్పుద్వారం ఎదుట పొన్నవాహన సేవ విశిష్టతను అర్చకులు వివరించారు. కల్పవృక్ష స్వరూపమైన భగవంతుడు భక్తుల కోరికలను తీర్చుతాడని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు గోవర్థనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహవాహన సేవ నిర్వహించనున్నారు.
