శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే....

శ్రీరామనవమి రోజు చదవాల్సిన శ్లోకాలు ఇవే....

 రామ నామంతో సకల పాపహరణం. శ్రీరామ నవమి ( ఏప్రిల్​ 17) సందర్భంగా రామ నామ స్మరణ చేసేందుకు శక్తివంతమైన రామనామ శ్లోకాలను తెలుసుకుందాం. . .

శ్రీ సీతారాముల కళ్యాణం కమనీయం.. రామరాజ్యం రమణీయం. శ్రీరాముని పట్టాభిషేకం సకల జనులను పరవశింపజేసే ఓ అద్భుతఘట్టం.ఆ అద్భుతమైన రోజు ... . భారతదేశంలో హిందువులంతా చైత్ర శుద్ధ నవమి అనగా ( 2024, ఏప్రిల్ 17) శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటున్నారు.త్రేతాయుగంలో వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని శ్లోకాలు  ఎంతో శక్తివంతమైనవి.. ప్రభావవంతమైనవి అని ప్రతీతి. మీరూ వాటిని పఠించి ఈ శ్రీరామ నవమిని మరింత వేడుకగా జరుపుకోండి.

1. రామ మూల మంత్రం:  ఓం శ్రీ రామాయ నమః

2. రామ తారక మంత్రం: శ్రీరామ జయ రామ జయ జయ రామ

3. రామ గాయత్రీ మంత్రం:  ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి.... తన్నో రామ ప్రచోదయాత్

4. రామ ధ్యాన మంత్రం:  ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదమ్ ... లోకాభిరామం శ్రీరామం భూయో-భూయో                                                    నమామ్యహమ్

5. కోదండ రామ మంత్రం :  శ్రీరామ జయ రామ జయ జయ రామ.. శ్రీరామ జయ రామ  కోదండ రామ 

6.  విష్ణు సహస్రకానికి సూక్ష్మరూపంగా చెప్పే శ్లోకం.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుందని పురాణాలు చెప్పినట్లుగా నివేదికలు ఉన్నాయి.

రాముడి జన్మ దినమును ప్రజలకు ఒక వేడుక. పద్నాలుగు సంవత్సరాల వనవాసము, ఆపై లంకను జయించి.. రావణ సంహారం గావించి తిరిగి అయోధ్య చేరిన తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. అందుకే శ్రీరామ నవమికి అంతటి ప్రాముఖ్యత.

లోకరక్షకుడు.. సుపరిపాలనాదక్షకుడు.. ధర్మనిరతుడు అయిన శ్రీరాముడు అంటే హిందూ మతాన్ని ఆచరించే అందరికీ ఎంతో భక్తి. రామ నామామృతం సకల పాపాలను హరించి వేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు  సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. . రామాలయాలన్నీ రామనామ స్మరణలో తరించిపోతాయి.