IPL 2025: రేపే ఐపీఎల్ 2025 మెగా ఫైనల్.. రిజర్వ్ డే కూడా రద్దయితే విజేత ఎవరంటే..?

IPL 2025: రేపే ఐపీఎల్ 2025 మెగా ఫైనల్.. రిజర్వ్ డే కూడా రద్దయితే విజేత ఎవరంటే..?

ఐపీఎల్ 2025 తుది సమరానికి చేరుకుంది. రెండు నెలలకు పైగా అభిమానులను అలరించిన ఈ మెగా టోర్నీ మంగళవారం (జూన్ 3) తో ఎండ్ కార్డు పడుతుంది. ఈ సీజన్ లో అత్యద్భుతంగా ఆడిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్. దీంతో ఈ సారి రెండు జట్లు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్ 1 లో పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. ఆదివారం (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. 

ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే:

ఐపీఎల్ 2025 ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. వర్షం కారణంగా జూన్ 3 న మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే బుధవారం (జూన్ 4) మ్యాచ్ ను నిర్వహిస్తారు. రిజర్వ్ డే (జూన్ 4) కూడా వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఈ సీజన్ లో పంజాబ్ 19 పాయింట్లతో టేబుల్ టాపర్ గా ఉంది. మరోవైపు 19 పాయింట్లతో ఆర్సీబీ రెండో స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ పంజాబ్ కు మెరుగ్గా ఉండడంతో పంజాబ్ కు అగ్రస్థానం దక్కింది. జూన్ 4 న మ్యాచ్ జరిపేందుకు 12 గంటల వరకు ఎదురు చూస్తారు. వర్షం తగ్గితే 5 ఓవర్ల చొప్పున మ్యాచ్ నిర్వహిస్తారు. 1:00 గంటలకు వర్షం తగ్గితే విజేత కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. 

ALSO READ : PBKS vs MI: ఓ వైపు కోపం.. మరోవైపు బాధ: ఓటమి తర్వాత తల పట్టుకొని తీవ్ర నిరాశలో నీతా అంబానీ

ఫైనల్ కు వర్షం ముప్పు లేదు 

ఐపీఎల్ 2025 ఫైనల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదివారం (జూన్ 1) అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. మూడు గంటల పాటు ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం. ఇక పంజాబ్ ప్రస్తుతం అహ్మదాబాద్ లోనే ఉంది. క్వాలిఫయర్ 2 కు వర్షం పడడంతో ఫైనల్ కు వర్షం పడే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. అయితే వాతావరణ సమాచార ప్రకారం ఫైనల్ జరిగే రోజు మ్యాచ్ కు ఎలాంటి వర్షం ముప్పు లేనట్టు తెలుస్తుంది.