
హైదరాబాద్ ఉప్పల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. లిటిల్ ఫ్లవర్ కాలేజ్ వద్ద స్కూల్ ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఓ విద్యార్ధి మృతి చెందాడు. అత్యంత వేగంగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటో భాష్యం స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో భాష్యం స్కూల్‌లో ఏడవ తరగతి చదువుతన్న అవంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. మిగిలిన వారందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని వదిలి పరారైనట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.