
గుంటూరు: క్రికెట్ బెట్టింగ్ లో ఓడిపోయి.. లక్ష రూపాయలు పోగొట్టుకున్న ఇద్దరు యువకులు… డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యాయత్నం చేశారు. చనిపోవాలని నిర్ణయించుకుని పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియోను తీసుకుని బంధువులు.. స్నేహితులకు పంపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఓ యువకుడు చనిపోగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన సంచలనం రేపింది.
పెదకూరుపాడు మండలం త్యాళ్లూరుకు చెందిన సురేష్, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ కలసి క్రికెట్ బెట్టింగ్ ఆడి లక్ష రూపాయలు నష్టపోయారు. బెట్టింగ్ నిర్వాహకుడికి తమ వద్ద ఉన్న 30వేలు చెల్లించి మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని బయటపడ్డారు. వడ్డీతో కలిపి మరో రూ.80 వేలు చెల్లించాలంటూ బెట్టింగ్ నిర్వాహకుడు తరచూ ఫోన్లు చేస్తుండడంతో విసిగిపోయారు. డబ్బులు ఎక్కడి నుండి తేవాలని ఆలోచిస్తూ… బాకీలు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
బకాయి డబ్బుల కోసం నిర్వాహకుడు ఒత్తిడి చేయడంతో భరించలేక సోమవారం గ్రామ శివార్లలో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకునేందు పురుగుల మందు తాగారు. తాము క్రికెట్ బెట్టింగ్ ఆడి లక్ష రూపాయలు నష్టపోయామని.. ఆ బాకీ డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడుతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని సత్తెనపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి గుంటూరులోని ఓ ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మంగళవారం మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై స్పందించిన బెల్లంకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.