బెట్టింగ్ లో లాస్..అప్పు తీర్చేందుకు  దొంగతనం

బెట్టింగ్ లో లాస్..అప్పు తీర్చేందుకు  దొంగతనం

హైదరాబాద్:  అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి రెడ్డి కాలనీలో ఇటీవల జరిగిన చోరీని పోలీసులు చేధించారు. సాయి రెడ్డి కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి..  బంగారంతో పాటు ఎనిమిది వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగను గుర్తించామన్నారు పోలీసులు.  చిత్తూరు జిల్లాకు చెందిన మహేష్ బాబు అల్వాల్ లో నివాసం ఉంటూ  ఐదు సంవత్సరాల నుండి ఆన్లైన్ లో బెట్టింగ్ ఆడుతున్నాడన్నారు. పలు రకాల  యాప్స్ లో  బెట్టింగ్ నిర్వహించేవాడని గుర్తించామన్న పోలీసులు.. బెట్టింగ్ వ్యసనంగా మారి పోవడంతో ఇంట్లో తల్లి దగ్గరనుండి కూడా భారీగా డబ్బులు, బంగారం లాక్కున్నాడని తేలిందన్నారు. అయితే బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోవడంతో  దొంగతనం చేస్తున్న మహేష్  వ్యవహారం ఇంట్లో తెలియడంతో కొన్ని రోజులు స్నేహితుల సాయంతో ఆల్వాల్ లో ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడన్నారు. కంపెనీలో వస్తున్న జీతం సరిపోకపోవడంతో తన సహచర ఉద్యోగుల వద్ద అప్పులు చేశాడని.. అయినా అప్పుల భారం పెరగడంతో ఏవిధంగా తీర్చాలో తెలియక దొంగతనానికి కుట్ర పన్నాడన్నారు. ఈ క్రమంలోనే మచ్చ బొల్లారంలోని సాయి రెడ్డి కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని మహేష్ బాబు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.  బాధితుల  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా మహేష్ బాబును గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు  తరలించామన్నారు.