టారిఫ్‎ల వల్ల ఇండియా, చైనా, రష్యాను కోల్పోయాం: ట్రంప్‎కు జ్ఞానబోధ అయినట్లు ఉంది..!

టారిఫ్‎ల వల్ల ఇండియా, చైనా, రష్యాను కోల్పోయాం: ట్రంప్‎కు జ్ఞానబోధ అయినట్లు ఉంది..!

వాషింగ్టన్: వాణిజ్య సుంకాల కారణంగా ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయి. అమెరికా ఏకపక్షంగా టారిఫ్‎లు విధించడంతో ఇండియా అగ్రరాజ్యానికి మొల్లగా దూరమవుతోంది. అమెరికాతో బంధం తెంచుకుంటున్న భారత్.. ప్రత్యర్థి చైనాకు దగ్గర అవుతోంది. ఇండియాపై అమెరికా 50 శాతం సుంకాలు విధించడాన్ని చైనా కూడా తీవ్రంగా ఖండించింది. ఈ క్రమంలో ఇండియా, చైనా మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుంది. 

ఇందులో భాగంగానే ఇటీవల చైనాలోని టియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా జిన్ పింగ్, పుతిన్‎తో మోడీ భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. సుంకాల పేరుతో ప్రపంచదేశాలపై ట్రంప్ అధిపత్యం చెలాయిస్తోన్న వేళ మోడీ, పుతిన్, జిన్ పింగ్ ఒక్కటి కావడం జియో పాలిటిక్స్‎లో చర్చనీయాంశంగా మారింది. 

రష్యా, చైనా, భారత్‎ల బంధాన్ని ట్రంప్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. అమెరికాకు వ్యతిరేకంగా ఈ మూడు దేశాలు ఏకం కావడాన్ని తట్టుకోలేకపోతున్నాడు. సుంకాల పేరుతో తన దారిలోకి తెచ్చకుందామని ప్రయత్నించినప్పటికీ అమెరికా బెదిరింపులను చైనా, రష్యా, భారత్ గడ్డితో పోచతో సమానంగా చూస్తున్నాయి. ఈ క్రమంలో భారత్, రష్యా, చైనాల బంధంపై ట్రంప్ బహిరంగంగానే తీవ్ర అక్కసు వెళ్లగక్కాడు.

►ALSO READ | ఆస్ట్రేలియాలో రేసిజం.. ఇండియన్సే టార్గెట్గా దాడులు.. బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న విదేశీయులు !

టియాంజిన్ సమావేశంలో పుతిన్, జిన్‌పింగ్‌లతో కలిసి ప్రధాని మోడీ ఉన్న ఫొటోను తన సొంత సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ ట్రూత్‎లో షేర్ చేసిన ట్రంప్ తీవ్ర ఆవేదన వెలిబుచ్చాడు. చైనా చేతిలో రష్యా, భారత్‎ను అమెరికా కోల్పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కపటబుద్ధి గల చైనాకు భారత్, రష్యా  దగ్గరైనట్లు తెలుస్తోందని.. ఈ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈ మూడు దేశాలకు సుదీర్ఘమైన, సంపన్నమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానని కడుపు మంట వెళ్లగక్కారు ట్రంప్. ఇండియాపై ఎడాపెడా సుంకాలు విధించిన ట్రంప్.. ఇప్పుడేమో చైనా చేతిలో భారత్‎ను కోల్పోయామని మొసలి కన్నీళ్లు కార్చడంపై పలువరు విమర్శిస్తున్నారు. ఇండియాపై ఏకపక్షంగా సుంకాలు విధించి తప్పు చేశామని ట్రంప్‎కు ఇప్పుడు జ్ఞానోదయమైదంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు.