మద్యం షాపులకు లాటరీ

మద్యం షాపులకు లాటరీ

డ్రా తీసిన నాలుగు జిల్లాల కలెక్టర్లు


హైదరాబాద్‌‌,వెలుగు :హైదరాబాద్‌‌ ఎక్సైజ్‌‌ జిల్లాకు 80, సికింద్రాబాద్‌‌ ఎక్సైజ్‌‌ జిల్లాకు 99 మద్యం షాపులను కేటాయించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్​లో ఆయన  లాటరీ తీశారు.  ఎస్టీలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, గౌడ్​లకు 15 శాతం రిజర్వేషన్ల కోటా కింద.. హైదరాబాద్​లో ఎస్టీలకు-1 , ఎస్సీలకు -4 , గౌడ్​లకు 5, సికింద్రాబాద్ పరిధిలో  ఎస్టీలకు-1 , ఎస్సీలకు -7,  గౌడ్​లకు -6  షాపులు కేటాయించారు. లాటరీ విధానం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎక్సైజ్​ సూపరింటెండెంట్లు విజయ్, పవన్ కుమార్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ యాదయ్య,  వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖాధికారి ఆశన్న,  గిరిజనాభివృద్ధి అధికారి సంధ్య పాల్గొన్నారు.

వికారాబాద్​లో..
వికారాబాద్:  జిల్లా కలెక్టరేట్​లో  మద్యం షాపులకు సంబంధించి లాటరీని  కలెక్టర్ నారాయణరెడ్డి డ్రా తీసి కేటాయించారు. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఎస్సీ, ఎస్టీ, గౌడ్​లకు రిజర్వేషన్లు కల్పిస్తూ షాపులను కేటాయించామని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలోని 59  షాపులకు  ఎస్టీలు 2, ఎస్సీలు 9, గౌడ్​లకు 6 చొప్పున  కేటాయించామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్ర,  జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజీ,  షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, వెనకబడిన కులాల అభివృద్ధి అధికారి ఉపేందర్, ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు. 

రంగారెడ్డి జిల్లాలో మొత్తం 234 షాపులు
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో 234 మద్యం షాపులకు కలెక్టర్ హరీశ్ డ్రా తీశారు. గురువారం జిల్లా కలెక్టరేట్​లో  ఎక్సైజ్, గిరిజన , సాంఘిక, వెనకబడిన సంక్షేమ శాఖల అధికారుల సమక్షంలో కలెక్టర్ మద్యం షాపులను కేటాయించారు. రిజర్వేషన్ల మేరకు ఎస్టీలకు 2, ఎస్సీలకు 17, గౌడ్​లకు 34  షాపులను ఎంపికచేశారు. జిల్లాలో సరూర్​నగర్ డివిజన్​లో 134 వైన్​షాపులకు ఎస్టీలకు-2, ఎస్సీలకు11, గౌడ్​లకు -25 చొప్పున అలాట్ చేశారు. శంషాబాద్ డివిజన్​లో 100  షాపులకు ఎస్సీలకు6, గౌడ్​లకు -9 ఇవ్వగా, ఎస్టీలు లేనందున వారికి కేటాయించలేదు. సరూర్​నగర్ ఎక్సైజ్ 
సూపరింటెండెంట్ టి.రవీందర్ రావు, శంషాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.శ్రీనివాస్ రావు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రామరావు, జిల్లా అసిస్టెంట్ బీసీ అభివృద్ధి అధికారి నీరజ రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రామేశ్వరి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.  

శామీర్​పేట: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 202 మద్యం దుకాణాలుండగా.. కలెక్టరేట్​లో కలెక్టర్ అమోయ్ కుమార్ లాటరీ తీసి రిజర్వేషన్ల ప్రకారం కేటాయించారు. గౌడ్​లకు 23, ఎస్సీలకు 12, ఎస్టీలకు 2 చొప్పున షాపులు కేటాయించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేశ్ కుమార్ , అధికారులు పాల్గొన్నారు.