
ధర్మపురిలో విషాదం
గర్భం దాల్చిన బాలిక
పరువు పోతుందని ఇంట్లోనే డెలివరీ చేసిన తల్లి
పుట్టగానే శిశువు.. కొద్ది గంటల్లోనే బాలిక మృతి
డెడ్‌బాడీ వెలికి తీసి పోస్టుమార్టం
జగిత్యాల/ధర్మపురి వెలుగు : మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసగించి తల్లిని చేశాడో యువకుడు.. పెళ్లి కాకుండానే గర్భవతయిందన్న బాధతో ఇంట్లోనే పురుడు పోసింది ఆమెను కన్న తల్లి. తెలిసీ తెలియని నాటుపద్దతులతో డెలివరీ చేయడంవల్ల పుట్టగానే శిశువు, కొన్ని గంటల్లోనే బాలిక చనిపోయారు. ఈ సంగతి బయటకొస్తే పరువు పోతుందని బాలిక తల్లి , కుటుంబసభ్యులు గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేశారు. అనుమానం వచ్చిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో సోమవారం పోలీసులు తల్లీబిడ్డల శవాలను వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ఈ సంఘటన చర్చనీయాంశమైంది.
ధర్మపురికి చెందిన 16 మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమపేరుతో లొంగదీసుకున్నాడు. మూడు నెలల తర్వాత కడుపులో నొప్పి వస్తుందని డాక్టర్ దగ్గరకు వెళ్తే కడుపుతో ఉన్నట్టు చెప్పింది. బాలిక తల్లి ఈ విషయాన్ని బయటకు తెలియకుండా దాచిపెట్టింది . ఏడు నెలల గర్భవతయిన బాలికకు శుక్రవారం నొప్పులు మొదలయ్యాయి. హాస్పిటల్‌కు తీసుకుపోతే విషయం బయటకొచ్చి పరువు పోతుందని బాలిక తల్లే డెలివరీ చేసింది. దాంతో పుట్టగానే బిడ్డ చనిపోయింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన బాలిక కూడా కొద్ది సేపటికే చనిపోయింది. చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి తల్లిని నిలదీయడంతో ఇద్దరు చనిపోయినట్టు చెప్పింది. గుట్టు చప్పుడు కాకుండా శనివారం అంత్యక్రియలు చేశారు. కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు .. ధర్మపురి తహసీల్దార్ రవీందర్ సమక్షంలో పంచనామా చేశారు. బాలిక,పసి గుడ్డు డెడ్‌బాడీలను జేసీబీతో తవ్వి బయటకు తీశారు. పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించి అనుమానాస్పద మరణాలుగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.