పెళ్లికి నిరాకరించాడని బాలిక సూసైడ్.. నారాయణపేటలో ఘటన

పెళ్లికి నిరాకరించాడని బాలిక సూసైడ్..  నారాయణపేటలో ఘటన

నారాయణపేట, వెలుగు: ప్రేమ పేరుతో ఒక బాలుడు బాలికను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని కోరగా, నిరాకరించడంతో బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో నారాయణపేట జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కురువ వీధికి చెందిన బాలిక(15) తండ్రి చనిపోవడంతో, స్థానికంగా ఉన్న ఓ బట్టల దుకాణంలో పని చేస్తోంది.

 కొద్ది రోజుల కింద నారాయణపేటలోని భీమంది కాలనీ చెందిన ఇంటర్​ చదువుతున్న బాలుడు(15)తో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొద్దిరోజులుగా వీరిద్దరూ కలిసి తిరుగుతున్నారు. అయితే బాలిక కొద్ది రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని బాలుడిని కోరింది. ఇందుకు నిరాకరిస్తూ వచ్చాడు. ఈక్రమంలో ఆదివారం బాలుడు ఆమె ఇంటికి వచ్చాడు. 

పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అక్కడ నుంచి బాలుడు వెళ్లిపోయిన కొద్దిసేపటికి బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బాలుడిని అరెస్ట్​ చేసినట్లు నారాయణపేట సీఐ శివశంకర్  తెలిపారు. 

పోస్టుమార్టం అనంతరం బాలిక డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించగా, రాత్రి 9 గంటల ప్రాంతంలో నారాయణపేట పాత బస్టాండ్  వద్ద మృతురాలి బంధువులు డెడ్​బాడీతో ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.