
నవదీప్ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రం ‘లవ్ మౌళి’. పంఖురి గిద్వానీ , భావన హీరోయిన్స్. జూన్ 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నవదీప్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే కొత్త కంటెంట్‌తో వస్తున్న వైవిధ్యమైన చిత్రమిది. చిరపుంజి, మేఘాలయాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. ఓ అందమైన సినిమా చేశామనే నమ్మకం కలిగింది. ఇరవై ఏళ్ల నా కెరీర్‌లో నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా అవుతుంది’ అన్నాడు.
దర్శకుడు మాట్లాడుతూ ‘నేటి యువతరానికి కావాల్సిన కంటెంట్‌తో పాటు అందరికీ రిలేట్ అయ్యే అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రేకప్‌లు అవుతున్నాయి.. కాంప్రమైజ్ అయితే తప్ప రిలేషన్స్ నిలబడవా అనే ప్రశ్నకు సమాధానమే ఈ చిత్రం. నవదీప్ ఎంతో కష్టపడ్డాడు. అందుకు తగ్గ ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నా’ అని చెప్పాడు.