
సాధారణంగా కొందరు షుగర్ తక్కువైంది లేదా షుగర్ లెవెల్స్ పడిపోయాయి అంటుంటే వింటుంటాం. అయితే లో షుగర్ (హైపోగ్లైసీమియా) అనేది డయాబెటిస్ ఉన్నవారిలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ, డయాబెటిస్ లేనివారికి కూడా లో షుగర్ వచ్చే అవకాశం ఉందని చాలామందికి తెలియదు. ఇది కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావొచ్చు. మెదడుకు గ్లూకోజ్ ఇంధనం లాంటిది. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయినప్పుడు వణుకు, తలతిరగడం, చెమటలు పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు దీనికి సరైన సమయంలో చికిత్స అందకపోతే తీవ్రమైన ప్రమాదం జరగొచ్చు
డయాబెటిస్ లేనివారిలో లో షుగర్ రావడానికి కారణాలు:
డయాబెటిస్ లేని వారిలో హైపోగ్లైసీమియా చాలా తక్కువగా ఉంటుంది కానీ దానిని తొలగించలేమని ఆసియన్ హాస్పిటల్‌లోని ఎండోక్రినాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సందీప్ ఖర్బ్ చెబుతున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు వాడే మందులను పొరపాటున తీసుకోవడం వల్ల కూడా లో షుగర్(Low sugar) రావచ్చు. అలాగే కొందరి లైఫ్ స్టయిల్ కారణాలు లేదా కొన్ని సందర్భాల్లో సాధారణ హార్మోన్ల పనితీరుకు అంతరాయం కలిగించే కణితుల(tumours) వల్ల సంభవించవచ్చు.
ALSO READ : ఉదయం వేళల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువట..
ఎక్కువగ మద్యం తాగడం: ఖాళీ కడుపుతో మద్యం తాగినప్పుడు లోవర్ గ్లూకోజ్‌ను రక్తంలోకి విడుదల చేయకుండా ఆగిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి చాలా పడిపోతుంది.
తీవ్రమైన అనారోగ్యాలు: కాలేయ వ్యాధులు (లివర్ సిరోసిస్, హెపటైటిస్), కిడ్నీ ఫెయిల్యూర్, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు లేదా గుండె జబ్బులు వంటివి గ్లూకోజ్ నియంత్రణను దెబ్బతీస్తాయి. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మందులు శరీరంలో ఎక్కువసేపు ఉండిపోయి చక్కెర స్థాయిలు పడిపోవడానికి కారణమవుతాయి.
ఆహారం తినకపోవడం : చాలా రోజులు ఆహారం తినకపోవడం లేదా ఆకలితో ఉండడం వంటి ఆహారపు లోపాలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉన్నప్పుడు శరీరంలోని గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి లో షుగర్ వచ్చే అవకాశం ఉంది.
ఇన్సులిన్ అధిక ఉత్పత్తి: క్లోమ గ్రంథిలో (ప్యాంక్రియాస్) చాలా అరుదుగా వచ్చే ఒక రకమైన క్యాన్సర్ ఇన్సులినోమా వల్ల శరీరం అధికంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా తగ్గిస్తుంది.
హార్మోన్ల లోపాలు: అడ్రినల్ లేదా పిట్యూటరీ గ్రంథులలో వచ్చే సమస్యల వల్ల గ్లూకోజ్ జీవక్రియలో పాల్గొనే హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే లో షుగర్ అనేది డయాబెటిస్ ఉన్న వారికీ, డయాబెటిస్ లేనివారికి కూడా రావచ్చు. ఎలాంటి కారణం లేకుండా మీకు ఒక్కసారిగా తలతిరగడం, చెమటలు పట్టడం లేదా ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరుని సంప్రదించడం ముఖ్యం. దీనికి కారణాన్ని ముందుగానే గుర్తించడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.