వాగులు దాటేదెట్ల?.. డేంజర్‌‌గా మారుతున్న లోలెవెల్ బ్రిడ్జిలు

వాగులు దాటేదెట్ల?.. డేంజర్‌‌గా మారుతున్న లోలెవెల్ బ్రిడ్జిలు
  • ప్రతిఏటా ఏదోచోట ప్రమాదం 
  • వర్షం పడితే రాకపోకలకు ఇబ్బందులు
  • పట్టించుకోని  అధికారులు 

సూర్యాపేట, వెలుగు: వానాకాలం వచ్చిందంటే చాలా వాగుల పరిధిలో ఉండే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఎక్కువ శాతం లోలెవల్‌ వంతెనలే ఉండడంతో వరద వాటిపై నుంచి పారుతోంది.  దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటాల్సి వస్తోంది.  ఈ క్రమంలో ప్రతి ఏటా ఏదోచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  అంతేకాదు ఈ వంతెనలు దశాబ్దాల కింద నిర్మించినవి కావడంతో చాలాచోట్ల పాడైపోయాయి. దీంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు అనేక గ్రామాలకు రోజుల తరబడి రాకపోకలు బంద్ అవుతున్నాయి.  ప్రజలు బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతున్నా.. అధికారులు ప్రపోజల్స్ పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. 

రెండు నియోజకవర్గాలలో ఇబ్బందులు

సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవవర్గాల్లో ఎక్కువగా వాగులు ఉన్నాయి. వీటిపై గత ప్రభుత్వాలు లోలెవల్‌ వంతెనలు, కల్వర్డులు నిర్మించాయి. వానాకాలం వచ్చినప్పుడుల్లా వరద వీటిపైనుంచి ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  సూర్యాపేట, చివ్వెంల, జాజిరెడ్డి గూడెం, తుంగతుర్తి, నూతన కల్, మద్దిరాల, మోతే, పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్) మండలాలతో పాటు తుంగతుర్తి పరిధిలోని సంగెం,- కేశవపురం నుంచి అన్నారం, లోయపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ వాగులు దాటాలంటే ప్రజలు సాహసం చేయాల్సి వస్తోంది.  మరోపక్క మూసీ ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేస్తే సూర్యాపేట ,- భీమారం రోడ్డు పై రోజుల తరబడి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.  

ప్రమాదాలు జరుగుతున్నా..

సూర్యాపేట –మహబూబాబాద్ జిల్లాలను కలిపే దంతాల పల్లి రోడ్డు ప్రమాదలకు నిలయంగా మారింది. చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), నూతన్ కల్ మండలాలే కాకుండా చివ్వెంల–ముకుందపురం మెయిన్ రోడ్డు నశింపేట వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. తుంగతుర్తి మండలంలోని కేశవ పురం–అన్నారం మద్య ఉన్న సంగెం వాగు నిరుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  ఇక ఆత్మకూర్(ఎస్) మండలంలోని హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్‌ మంజూరు కాగా  పిల్లర్ల స్టేజీ వరకు వచ్చింది.  కానీ,  రెండు రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. మరోపక్క బందం వాగుపై చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రెండు చోట్ల తప్ప జిల్లాలో మరెక్కడా పనులు చేపట్టలేదు.  మరోపక్క లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు.