జిల్లాలోకి మహారాష్ట్ర వడ్లు ఇంకా ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు.. తొలగని అలాట్మెంట్ తిప్పలు

జిల్లాలోకి మహారాష్ట్ర వడ్లు ఇంకా ఊపందుకోని ధాన్యం కొనుగోళ్లు..  తొలగని అలాట్మెంట్ తిప్పలు

నిజామాబాద్​, వెలుగు: బోనస్​ ఆశతో మహారాష్ట్ర నుంచి సన్నవడ్లు జిల్లాకు వస్తున్నాయి. బార్డర్​ దాటొచ్చిన వడ్ల లారీ ఈనెల 23న పట్టుబడింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. మరో పక్క జిల్లాలో సాగైన వానాకాలం వడ్ల కొనుగోళ్లు ఇంకా ఊపందుకోలేదు. యాసంగి సీజన్​లో సేకరించిన వడ్లు గోదామ్​ల నుంచి ఖాళీ కాకపోవడంతో కొత్త వడ్లను నిల్వ చేసేందుకు స్థలం కొరత నెలకొంది. దీంతో కాంటాలు పెట్టిన వడ్లు ఎక్కడ దింపాలో అర్థంకాక సివిల్​ సప్లయి ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నారు. తరుగు పేరుతో మిల్లర్లు రైతులను ముంచేందుకు సిద్దమయ్యారు. 

మహారాష్ట్ర నుంచి వస్తున్న వడ్లు 

ప్రభుత్వం 'ఏ' గ్రేడ్​ వడ్లు క్వింటాల్​కు రూ.2,389 , కామన్​ రకానికి 2,369 చెల్లిస్తోంది. సన్నరకం వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్​ ఇస్తుండడంతో మహారాష్ట్ర నుంచి వడ్లను జిల్లాకు తరలిస్తున్నారు. కోటగిరి మండలం పోతంగల్​, రెంజల్​మండలం కందకుర్తి, సాలూరా, హంగర్గా మహారాష్ట్రను ఆనుకుని ఉన్నాయి. ఈ గ్రామాల రైతులు చాలా మంది మహారాష్ట్రలో భూములు కౌలు తీసుకొని వరి పండిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈనెల 23న సాలూరా చెక్​పోస్టు మీదుగా వచ్చిన వడ్ల లారీని లోకల్​ రైతులు గుర్తించి రెవెన్యూ ఆఫీసర్లకు సమాచారం అందించగా.. వారు లారీని పట్టుకున్నారు. అప్పటికే మహారాష్ట్ర నుంచి వచ్చిన వడ్లు సరిహద్దు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తూకం జరిగినట్టు గుర్తించి విచారణ చేస్తున్నారు. స్థానిక పట్టాపాస్​ బుక్​, ఏఈవో ధ్రువీకరణ ఉంటేనే తూకం వేయాలని, అవేమీ లేకుండా వడ్ల కాంటాలు ఎలా జరిగాయని ఎంక్వయిరీ చేస్తున్నారు. 

మళ్లీ కడ్తా సేకరణ

సర్కార్​ రూల్​ ప్రకారం రైతుల వడ్లలో కోత పెట్టకూడదు. అయితే ప్రతి కొనుగోలు సెంటర్​లో నిర్వహకులు రకరకాల పేర్లతో తరుగు తీస్తున్నారు. ప్రతి 40 కిలోల బస్తాకు కిలో అదనంగా తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వెళ్లిన వడ్ల లారీ అన్​లోడ్​ చేయడానికి మిల్లర్​ ప్రతి క్వింటాల్​కు కిలోన్నర ధాన్యం కోత పెడుతున్నారు. దీనిని నిరసిస్తూ పోతంగల్​ మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తహసీల్దార్​ గంగాధర్​ శనివారం ఏర్పాటు చేసిన మీటింగ్​కు మిల్లర్లు అటెండ్​ కాలేదు.

భారీ విస్తీర్ణంలో సాగు

వానాకాలం జిల్లాలో 5.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. అందులో 4.42 ఎకరాల్లో వరి సాగయ్యింది. 12.5 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసిన సివిల్​ సప్లయి అధికారులు 9 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని టార్గెట్​ పెట్టుకున్నారు. యాసంగిలో కొనుగోలు చేసిన 8.40 లక్షల మెట్రిక్​ టన్నుల్లో 5.62 టన్నుల సరుకు ఇంకా గోదాముల్లో ఉంది. దీంతో కొత్తగా స్టాక్​ చేయడానికి స్థలం సమస్య వెంటాడుతోంది. 

కాంటా పెట్టిన వడ్లు ఎక్కడికి పంపాలో తేలక సెంటర్​ నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎడపల్లి మండలంలో రైతులు రాస్తారోకో చేయడంతో ఆ వడ్లను నాలుగు మిల్లులకు అలాట్​చేశారు. ఓపెన్​ ప్లేస్​లో వడ్లు నిల్వ చేస్తున్న మిల్లర్లు వర్షాలు పడితే ధాన్యం తడిసిపోతుందని భయపడుతున్నారు.