మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

మరోసారి పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర

బాదుడే..బాదుడు..సామాన్యుల నడ్డి విరిచేలా చమురు సంస్థలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ తో పాటు గ్యాస్ ధరలను పెంచేస్తున్నాయి. మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర 50కి పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర 1055 నుంచి రూ. 1105కి చేరింది. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో రూ. 1053గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబాయిలో రూ. 1002.50 నుంచి రూ. 1052.50, కోల్ కతాలో రూ. 1,029 నుంచి రూ.1,079కి చేరింది.

చెన్నైలో రూ.1,058.50 బదులుగా రూ. 1,068.50 చెల్లించాల్సి ఉంటుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 8.50 తగ్గడం విశేషం. సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 01న 19 కిలోల సిలిండర్ ధరను రూ. 183.50 మేర తగ్గించిన విషయం తెలిసిందే. పెరిగిన గ్యాస్ ధరలతో సామాన్యులపై ప్రతికూల ప్రభావం పడనుంది.