
న్యూఢిల్లీ: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) కమర్షియల్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 పెరిగింది. గత నెల 1న సిలిండర్ ధరలు పెరగగా.. వరుసగా రెండో నెల కూడా ప్రైజ్ పెరిగింది. పెరిగిన ధరలను బట్టి దేశ రాజధానిలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,051గా ఉంది. కోల్ కతాలో రూ. 2,174, చెన్నైలో 2,234గా ఉంది.
గృహావసరాల కోసం వినియోగించే 14.2 కిలోలు, 5 కేజీలు, 10 కిలోల సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.899గా ఉంది. కాగా, ప్రతినెలా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి ఎల్పీజీ సిలిండర్ ధరలను రివైజ్ చేస్తుంటారు. నవంబర్ లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.266 పెరిగింది. ఇప్పుడు వరుసగా రెండో నెలలో కూడా సిలిండర్ల ధరలు పెరగడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు.