టీఆర్‌‌ఎస్‌లో చేరుతున్నా.. చంద్రబాబుకు ఎల్‌ రమణ లేఖ

టీఆర్‌‌ఎస్‌లో చేరుతున్నా.. చంద్రబాబుకు ఎల్‌ రమణ లేఖ

హైదరాబాద్: టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు అందులో తెలిపారు. ‘‘తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని నిర్ణయించుకున్నాను. తెలుగు దేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా నా ఎదుగుదలకు తోడ్పడిన మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు’’ అంటూ తన రాజీనామా లేఖలో ఎల్ రమణ పేర్కొన్నారు. కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి ఎల్.రమణ ఆ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. నిన్న (గురువారం) దీనిపై క్లారిటీ వచ్చేసింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌ రావుతో కలిసి, ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌‌ను కలిశారు. సామాజిక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌లో చేరాలని ఈ సందర్భంగా కేసీఆర్ ఆహ్వానించారని, తాను సానుకూల నిర్ణయం తీసుకుంటానని నిన్న ఎల్ రమణ మీడియాతో చెప్పారు. ఇందులో భాగంగా ఇవాళ అధికారికంగా టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.