LSG vs GT: గుజరాత్‌ను బోల్తా కొట్టించిన పాండ్యా.. లక్నోకు మూడో విజయం

LSG vs GT: గుజరాత్‌ను బోల్తా కొట్టించిన పాండ్యా.. లక్నోకు మూడో విజయం

గుజరాత్ విజయ లక్ష్యం. 164 పరుగులు.. తొలి ఐదు ఓవర్లు ముగిసేసరికి టైటాన్స్ స్కోర్.. 47/0. సాయి సుదర్శన్(31), శుభమాన్ గిల్(19) జోడి ఓవైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు వేగంగా పరుగులు చేస్తున్నారు. చివరి 15 ఓవర్లలో విజయానికి కావాల్సింది 117 పరుగులు .. చేతిలో 10 వికెట్లు.. అందరూ మ్యాచ్ ఏకపక్షం అనుకున్నారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన లక్నో ఆల్‌రౌండర్, హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

164 పరుగుల ఛేదనలో గుజరాత్‌కు మంచి ఆరంభం లభించింది. సాయి సుదర్శన్(31), శుభమాన్ గిల్(19) జోడి తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ఆ సమయంలో యష్ ఠాకూర్.. గిల్‌ను ఔట్ చేసి గుజరాత్ శిబిరంలో అలజడి రేపాడు. అక్కడినుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్ ద్వయం గుజరాత్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. బిష్ణోయ్ వైవిధ్యమైన బంతులతో బోల్తా కొట్టిస్తే, పాండ్యా అర్థాడాక్స్ బంతులతో బెంబేలెత్తించాడు. కాలక్రమేణ పరుగులు రావడం కష్టమవ్వడం, కావాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో టైటాన్స్ బ్యాటర్లు ఒత్తిడిలోకి జారుకుని మ్యాచ్ చేజార్చుకున్నారు. ఛేదనలో గుజరాత్ 130(18.5 ఓవర్లలో) పరుగులకే ఆలౌటైంది.

లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 11 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. యష్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

లక్నోకిది మూడో విజయం.. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైన లక్నో, అనంతరం పుంజుకొని పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై వరుస విజయాలు సాధించింది.