LSG vs PBKS: పూరన్, పాండ్యా మెరుపులు.. పంజాబ్ ముంగిట భారీ టార్గెట్

LSG vs PBKS: పూరన్, పాండ్యా మెరుపులు.. పంజాబ్ ముంగిట భారీ టార్గెట్

ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్(54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ నికోలస్ పూరన్(42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా సోదరుడు కృనల్ పాండ్యా(43 నాటౌట్; 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. దీంతో లక్నో.. పంజాబ్ ముంగిట 200 లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.

ఆది నుంచే దూకుడు

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నో బ్యాటర్లు ఆది నుంచే దూకుడు కనబరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్‌కు డికాక్- రాహుల్(15) జోడి  35 పరుగులు జోడించారు. అనంతరం రాహుల్ వెనుదిరగ్గా.. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన పడిక్కల్(9) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. ఆ సమయంలో డికాక్- స్టోయినీస్(19; 12 బంతుల్లో 2 సిక్స్‌లు) జోడి ఆదుకున్నారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో స్టోయినీస్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన పూరన్ పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

చివరలో పూరన్ ఔటైనా.. కృనల్ పాండ్యా మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. హర్షల్ పటేల్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. దీంతో లక్నో.. పంజాబ్ ముంగిట భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పర్వాలేదనిపించిన పంజాబ్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం సమిష్టిగా విఫలమయ్యారు.