LSG vs PBKS: గబ్బర్ పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం

LSG vs PBKS: గబ్బర్ పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం

రోజులు గడుస్తున్న కొద్దీ ఐపీఎల్ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. లక్ష్యం ఎంతైనా దాన్ని కాపాడుకోవడంలోనూ, చేధనలోనూ ప్రత్యర్థి జట్లు ఆఖరివరకూ తలొంచడం లేదు. శనివారం(మార్చి 30) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ అలాంటి మజానే అందించింది. తొలుత లక్నో 199 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పంజాబ్ ఆఖరి 5 ఓవర్లలో తడబడి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక సమయంలో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్ళినా.. లక్ష్యం పెద్దది కావడంతో చూస్తుండగానే ఫలితం తారుమారయ్యింది.

పూరన్, పాండ్యా మెరుపులు

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డి కాక్(54; 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా.. కెప్టెన్ నికోలస్ పూరన్(42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా సోదరుడు కృనల్ పాండ్యా(42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. దీంతో లక్నో.. పంజాబ్ ముంగిట 200 లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.

గబ్బర్ ఒంటరి పోరాటం

అనంతరం 200 పరుగుల ఛేదనలో పంజాబ్ కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(70; 50 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో(42; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతోన్న ఈ జోడీని మయాంక్ యాదవ్ విడదీశాడు. అక్కడి నుండి పంజాబ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. గబ్బర్ తన పోరాటాన్ని ఆపలేదు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూనే వచ్చాడు. అయితే, రన్ రేట్ అంతకంతకూ పెరుగుతూ పోవడంతో పంజాబ్ బ్యాటర్లు ఏమీ చేయలేకపోయారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్ తన 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.