
- దాక్కోవాలని అనుకుంటే కలుగు వెతుక్కోవాల్సిందేనన్న సుమేర్ ఇవాన్
- ఆ దేశం మొత్తాన్నీ కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నయ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలో ఎక్కడైనా సరే దాడి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డీ కున్హా అన్నారు. మన ఆయుధాల నుంచి తప్పించుకోవాలంటే వారు ఏదైనా కలుగు వెతుక్కోవాల్సిందేనని అన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్మీ హెడ్ క్వార్టర్‌ను రావల్పిండి నుంచి వేరే ప్రాంతానికి మార్చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీ కున్హా స్పందించారు. పాక్ భూభాగంలో ప్రతీ ఏరియాను కవర్ చేయగల ఆయుధాలు మన దగ్గర ఉన్నాయని చెప్పారు. పాక్ ఆర్మీ హెడ్‌క్వార్టర్‌ను రావల్పిండి నుంచి ఆ దేశంలో ఎక్కడికి మార్చినా సరే మన ఆయుధాల రేంజ్ దాటలేరని వివరించారు.
అవసరమైనపుడు మన సరిహద్దుల నుంచే మిసైల్ దాడి చేయగలమని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో అధునాతన స్వదేశీ సాంకేతికత, లాంగ్రేంజ్ డ్రోన్లు, గైడెడ్ మిస్సైళ్లు కీలక పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు. నాలుగు రోజుల్లో పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు మీదుగా దాదాపు 800 నుంచి వెయ్యి డ్రోన్‌లను ప్రయోగించిందని, మన సైన్యం, నేవీ, వైమానిక దళం సమన్వయంతో వాటిని నాశనం చేసిందని చెప్పారు. ఈ రోజు మనం సాధించిన విజయంతో కేవలం సైనికులే కాదు.. దేశం మొత్తం గర్వపడుతున్నదని తెలిపారు.