- ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘటన
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 7వ తరగతి చదువుతున్న బాలికపై ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు..ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, బాలికను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రలోభపెట్టిన ప్రధాన నిందితుడు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం..సరోజిని నగర్ కు చెందిన బాలిక 7వ తరగతి చదువుతున్నది. ఇటీవల ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో విమల్ యాదవ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరూ ఫోన్‌లో చాట్ చేయడం, కాల్స్ మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ నెల 2న కలుద్దామని మైనర్‌ని విమల్ కోరాడు. అతని మాయమాటలు నమ్మిన బాలిక మీటింగ్ పాయింట్‌కు చేరుకుంది. అయితే, అక్కడ విమల్‌తో అతని ఫ్రెండ్స్ పియూశ్ మిశ్రా, శుభం శుక్లా కూడా ఉన్నారు.
కారులో సరదాగా ఓ తిరుగుదామని చెప్పిన ముగ్గురూ కలిసి బాలికను స్కార్పియోలోకి ఎక్కించారు. అనంతరం కొంతదూరంలోని హోటల్ కు వెళ్లి రూమ్ తీసుకున్నారు. బాలిక ఫోన్ లాక్కుని, ఆమెను ఓ గదిలో బంధించారు. తనను వదిలి పెట్టామని అరవడంతో ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అనంతరం రెండు రోజులపాటు మైనర్‌పై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను ఆమె ఇంటి వద్ద డ్రాప్ చేసి పరారయ్యారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
