GT vs LSG: గుజరాత్‌కి చెక్ పెట్టిన లక్నో.. నాలుగు ఓటముల తర్వాత పంత్ సేనకు ఊరట విజయం

GT vs LSG: గుజరాత్‌కి చెక్ పెట్టిన లక్నో.. నాలుగు ఓటముల తర్వాత పంత్ సేనకు ఊరట విజయం

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జయింట్స్ ఊరట విజయాన్ని అందుకుంది. గురువారం (మే 22) గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో గెలిచి వరుస పరాజయాలకు బ్రేక్ వేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్ (117) సెంచరీతో చెలరేగగా.. బౌలర్లు ఒత్తిడిలో రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. 

236 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. సాయి సుదర్శన్, గిల్ తొలి వికెట్ కు 46 పరుగులు జోడించారు. సూపర్ ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్ 21 పరుగులు చేసి ఔటయ్యాడు. బట్లర్, గిల్ చెలరేగి ఆడడంతో పవర్ ప్లే లో గుజరాత్ 67 పరుగులు చేసింది. పవర్ ప్లే తర్వాత గిల్ వెంటనే ఔట్ కాగా.. ఉన్నంత సేపు మెరుపులు మెరిపించి బట్లర్ 18 బంతుల్లోనే 33 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ దశలో గుజరాత్ ఓటమి ఖాయమన్న దశలో షారుక్ ఖాన్, రూథర్ ఫోర్డ్ చెలరేగి ఆడారు. ఇద్దరూ బౌండరీల వర్షం కురిపిస్తూ లక్నోని టెన్షన్ పెట్టారు.

నాలుగో వికెట్ కు 38 బంతుల్లోనే 86 పరుగులు జోడించి మ్యాచ్ పై ఆశలు  రేకెత్తించారు. 14-16 ఓవర్ల మధ్యలో 18 బంతుల్లోనే 53 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని 17 ఓవర్ తొలి బంతికి విలియం ఓరూర్కే విడదీశాడు. రూథర్ ఫోర్డ్ ను ఔట్ చేసి లక్నోకి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ (57) హాఫ్ సెంచరీతో ఒంటరి  పోరాటం చేసినా టార్గెట్ ఎక్కువగా ఉండడంతో గుజరాత్ కు ఓటమి తప్పలేదు. లక్నో బౌలర్లలో విలియం ఓరూర్కే మూడు వికెట్లు పడగొట్టాడు. ఆవేశ్ ఖాన్,బదోని రెండు.. ఆకాష్ మహరాజ్, షాబాజ్ తలో వికెట్ పడగొట్టారు.  
  
మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ బ్యాటింగ్ లో విశ్వరూపం చూపించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్(64 బంతుల్లో 117: 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి ఆడగా.. పూరన్(56), మార్కరం (36) మెరుపులు మెరిపించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. మార్ష్ (117) సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్నో బౌలర్లలో సాయి కిషోర్, అర్షద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.