కొందరికి లక్కు.. ఎందరికో లాసు!

కొందరికి లక్కు.. ఎందరికో లాసు!
  • రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో లిక్కర్ షాపులకు ముగిసిన లక్కీ డ్రా
  • దక్కినోళ్ల కేరింతలు.. దక్కనోళ్ల కన్నీళ్లు
  • సూర్యాపేట జిల్లాలో దంపతులకు, వదినా మరదళ్లకు షాపులు
  • పదుల సంఖ్యలో దరఖాస్తులేసినా కొందరు వ్యాపారులకు ఒక్కటీ రాలే
  • మంచిర్యాల జిల్లాలో వంద అప్లికేషన్లు వేస్తే రెండే వచ్చినయ్
  • షాపులు దక్కిన వాళ్లకు గుడ్​విల్ ఇచ్చి  తీసుకునేందుకు ప్రయత్నాలు

నెట్‌వర్క్, వెలుగు: లిక్కర్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా ముగిసింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లక్కీ డ్రా కొందరికి లక్కును.. ఎంతో మందికి లాస్‌ను మిగిల్చింది. షాపులు దక్కినోళ్లు ఆనందంతో కేరింతలు కొట్టగా, దక్కనోళ్లు నిరాశకు గురయ్యారు. 2,620 షాపులకు 1.3 లక్షల మందిపైగా దరఖాస్తు చేసుకోగా.. డ్రాలో తమ పేరు లేకపోవడంతో అప్పులు తెచ్చి పెట్టిన వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో ఉదయం 11 గంటలకు లిక్కర్ షాపుల డ్రా మొదలైంది.

దీంతో ఆయా చోట్ల దరఖాస్తుదారులతో హాళ్లన్నీ కిటకిలాడాయి. పాత సిండికేట్‌‌‌‌లోని లిక్కర్ వ్యాపారులు చాలాచోట్ల వందల్లో దరఖాస్తులు చేసుకున్నా దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. దీంతో షాపులు దక్కిన వాళ్లకు గుడ్​విల్ ఇచ్చి వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 20‌‌‌‌‌‌‌‌23–25 ఎక్సైజ్ పాలసీకి సంబంధించి రాష్ట్రంలో 2,620 లిక్కర్ షాపులకు ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించగా.. 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో దుకాణాలు పొందిన వారు.. ఈ నెల 23లోగా లైసెన్స్‌‌‌‌ ఫీజులో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. 

ష్యూరిటీ ఇచ్చేందుకు క్యూ కట్టిన బ్యాంకులు

లైసెన్స్‌‌‌‌లు దక్కినవాళ్లకు ష్యూరిటీ ఇచ్చేందుకు బ్యాంకులు క్యూకట్టాయి. లక్కీ డ్రా జరిగే చోట్ల బ్యాంకర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం గమనార్హం. సీఎం కేసీఆర్​సొంత జిల్లా సిద్దిపేటలో డ్రా జరుగుతున్న విపంచి ఆడిటోరియం వద్ద ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ఇలాంటి ఓ ఫ్లెక్సీ పెట్టింది. అదనపు సెక్యూరిటీ అవసరం లేకుండా, తక్కువ వడ్డీకి, తొందరగా గ్యారంటీ ఇస్తామంటూ కొత్త వైన్స్‌‌‌‌లకు ఆఫర్ ఇచ్చింది.

ఒక నంబర్ అనుకొని మరో నంబర్

కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాపులు ఉండగా.. 48 షాపులకే లాటరీ నిర్వహించారు. మద్దెలచెర్వు షాపునకు 2 అప్లికేషన్లు మాత్రమే రావటంతో వాయిదా వేశారు. 13వ నంబర్ షాపు డ్రాలో 45 నంబర్ రాగా.. ఆఫీసర్లు 5వ నంబర్ అని పొరపాటున ప్రకటించారు. ఆ వెంటనే తప్పు తెలుసుకొని సరిదిద్దారు. ఈ ఘటనపై ఎక్సైజ్​ ఆఫీసర్లపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.

వంద వేస్తే రెండే వచ్చినయ్

మంచిర్యాల జిల్లాలో 73 షాపులకు గాను 2,242 అప్లికేషన్లు వచ్చాయి. లిక్కర్ బిజినెస్‌‌‌‌ను శాసిస్తున్న పలువురు సిండికేట్‌‌‌‌గా మారి టెండర్లు వేశారు. ఓ గ్రూపు వంద షాపులకు అప్లై చేస్తే రెండే దక్కాయి. మరో గ్రూపు సైతం వంద షాపులకు దరఖాస్తు చేయగా ఐదు వచ్చాయి. 398 మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా.. 15 మందికి షాపులు వచ్చాయి.

మహిళలకు నాలుగో వంతు

యాదాద్రి జిల్లాలో 82 షాపులకు గాను 20 షాపులు మహిళలకు దక్కాయి. మొదటి షాపే మహిళకు అలాట్ కావడం విశేషం. ఇక ఖమ్మం జిల్లాలో 122 షాపులకు గాను 26 షాపులను మహిళలు దక్కించుకున్నారు. కొంతమంది సిండికేటుగా మారి వందకు పైగా అప్లికేషన్లు చేసుకున్నా.. ఒక్క షాపు కూడా దక్కకపోవడంతో నిరాశ చెందారు. సూర్యాపేట జిల్లాలో 99 షాపులకు గాను 25 షాపులు మహిళలకు దక్కాయి. కరీంనగర్ జిల్లాలో 94 షాపుల్లో 14 షాపులను లేడీస్ దక్కించుకున్నారు.

చేజారిన లక్కు

సంగారెడ్డిలో డ్రా తీసిన టోకెన్ నంబర్ చూడకముందే జారి పడిపోవడంతో గందరగోళం జరిగింది. జిల్లా కలెక్టర్ శరత్.. రామచంద్రపురం 27వ వైన్ షాపు కోసం కాయిన్ తీశారు. అయితే కాయిన్ నంబర్ చూడకుండానే మీడియాకు చూపిస్తుండగా.. అది పొరపాటున జారి మిగతా కాయిన్స్‌‌‌‌లో పడిపోయింది. నంబర్ చూడనందున అదే దుకాణానికి మళ్లీ డ్రా తీశారు. 31 నంబర్ రావడంతో కనకాంబర అనే వ్యక్తి షాప్​ దక్కించుకున్నాడు. పడిపోయిన కాయిన్ మీద నంబర్ 55 ఉందని, అది తమదేనని ఉజ్వల గ్రూప్ నకు చెందిన గాడే శ్రీనివాస్ తెలిపారు. లక్కీ డ్రాలో 31వ నంబర్‌‌‌‌‌‌‌‌ నెగ్గిందని కలెక్టర్ ప్రకటించడంతో.. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బయటికి పంపించారు. డ్రాలో తమకు కావాలనే అన్యాయం చేశారని, ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని గాడే శ్రీనివాస్ చెప్పారు.

సూర్యాపేటలో లక్కీ కపుల్

సూర్యాపేట జిల్లాలోని నాగారం, మద్దిరాల మద్యం షాపులు తునుకునూరి అశోక్​, దివ్య అనే భార్యాభర్తలకు దక్కాయి. కోదాడలోని రెండు దుకాణాలు వదినా మరదళ్లకు వచ్చాయి. ఇక్కడ ఒక బెల్ట్ షాప్ నడిపించే వ్యక్తితో ఎక్సైజ్ అధికారులు బలవంతంగా రెండు షాపులకు దరఖాస్తు చేయించారు. అతనికి డ్రాలో ఒక్కటికీ రాకపోవడంతో అధికారులను తిట్టుకుంటూ వెళ్లిపోయాడు.