
నిర్మల్/సూర్యాపేట/గద్వాల, వెలుగు: ఉత్తరాది రాష్ట్రాల్లో వందలాది పశువులను బలిగొన్న ‘లంపి స్కిన్’ రాష్ట్రంలోనూ శరవేగంగా వ్యాపిస్తోంది. కొన్ని రోజులుగా జిల్లాల్లోని పశువుల మందలపై వ్యాధి పంజా విసురుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలర్ట్అయిన పశువైద్యాధికారులు వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపడుతున్నారు. నిర్మల్‌జిల్లా భైంసా మండలంలోని టాక్లి గ్రామంలో కొన్ని పశువుల మందల్లో లంపి స్కిన్ లక్షణాలు బయటపడ్డాయి.లక్ష్మణచందా మామడ, తానూర్ మండలాల్లో కూడా చాలా పశువులకు వైరస్ సోకడం పాడి రైతులను టెన్షన్పెడుతోంది. వ్యాధి సోకిన పశువుల శరీరంపై బొబ్బలు రావడం, పూర్తిగా బలహీనపడి మేత సరిగ్గా మేయకపోవడం, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పశువులపై బొబ్బలు కనిపించగానే పాడి రైతులు వాటిని మందల నుంచి వేరు చేస్తున్నారు. మరికొందరికి వ్యాధిపై అవగాహన లేక మందల్లోనే ఉంచుతుండడంతో వేగంగా విస్తరిస్తోంది. పశువైద్యాధికారులు మాత్రం ఇలాంటి లక్షణాలు బయటపడగానే గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. నిర్మల్‌జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 8 వేల పశువుల్లో ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో ‘గోట్ ఫాక్స్ వ్యాక్సిన్’ ఇచ్చినట్లు వెటర్నరీ ఆఫీసర్లు చెప్తున్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో ఉప్పుల లింగయ్య అనే రైతు ఆవు కుంటుతోందని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు.ఆవు కుడివైపు చర్మంపై బొబ్బలు కనిపించడంతో అనుమానం వచ్చిన వెటర్నరీ డాక్టర్ వేణుగోపాల్ పరీక్షలు నిర్వహించారు. ‘లంపి స్కిన్’ లక్షణాలుగా గుర్తించి ఆవుకు చికిత్స చేశారు. రైతు లింగయ్యకు పలు జాగ్రత్తలు వివరించి పంపించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ‘లంపి స్కిన్’ వేగంగా వ్యాపిస్తోంది. జిల్లాలో 1,33,000 పశువులు ఉండగా ఆవుల్లో లంపి స్కిన్ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు సగానికి పైగా పశువులకు వ్యాధి సోకినట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 30 వేల పశువులకు వ్యాక్సిన్లు వేశారు.
బార్డర్లో చెక్ పోస్టుల ఏర్పాటు
నిర్మల్‌జిల్లాకు మహారాష్ట్ర నుంచి పశువులు దిగుమతి కాకుండా అధికారులు పక్కాగా చర్యలు చేపడుతున్నారు. బెల్తారోడా, తానూర్, కుభీర్, అప్పారావుపేట్ తదితర స్టేట్బార్డర్స్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ ల వద్ద వెటర్నరీ సిబ్బందితో పాటు పోలీసులు కూడా డ్యూటీ నిర్వహిస్తున్నారు. జిల్లా నుంచి మహారాష్ట్ర వైపు కూడా పశువులు వెళ్లడం లేదు. ఇరువైపులా పశువుల ఎగుమతులు, దిగుమతులు పూర్తిగా నిలిపేశారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల కొనసాగుతున్న పశువుల సంతలను సైతం బంద్ పెట్టారు. ఆయా గ్రామపంచాయతీలు పశువుల సంతలను నిర్వహించొద్దంటూ ఆదేశాలు జారీ చేశాయి. నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో బీఫ్ మార్కెట్ లపై కూడా ఆంక్షలు విధిస్తున్నారు.
గ్రామాల్లో అవగాహన శిబిరాలు
పశు వైద్యశాలల పరిధిలోని గ్రామపంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశువులకు వైద్య చికిత్సలు చేస్తూనే పాడి రైతులకు ‘లంపి స్కిన్’ వ్యాధి లక్షణాలు, దాని తీవ్రతను వివరిస్తున్నారు. పశువుల మందలో లక్షణాలు కనిపించగానే తమకు సమాచారం ఇవ్వాలని, వ్యాధి సోకిన పశువును ఇతర పశువులకు దూరంగా ఉంచాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపించిన పశువులన్నింటికీ యుద్ధ ప్రాతిపదికన గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. గోట్ ఫాక్స్ వ్యాక్సిన్ కూడా అన్ని పశు వైద్యశాలలకు ఇప్పటికే పంపిణీ చేశారు.
అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
‘లంపి స్కిన్’ వ్యాధి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలుచోట్ల ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో గోట్ ఫాక్స్ వ్యాక్సిన్‌ను పశువులకు అందిస్తున్నాం. జిల్లాలో వ్యాక్సిన్ కొరత లేదు. అలాగే పాడి రైతులకు లంపి స్కిన్ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నాం. అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాధి తీవ్రత తగ్గిపోనుంది.
– డాక్టర్ బి.శంకర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, నిర్మల్