శుక్రవారం రాత్రి చంద్ర గ్రహణం: ఇది కొంచెం స్పెషల్!.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?

శుక్రవారం రాత్రి చంద్ర గ్రహణం: ఇది కొంచెం స్పెషల్!.. ఏ టైమ్‌లో చూడొచ్చంటే?

గట్టిగా రెండు వారాల్లోనే మరో ఖగోళ అద్భుతం.. 2019 చివరిలో డిసెంబరు 26న సూర్య గ్రహణం కనువిందు చేసింది. కొత్త సంవత్సరం మొదలైన పది రోజులకే చల్లటి చంద్రుడు గ్రహణం నీడలో కొత్తగా కనిపించబోతున్నాడు. శుక్రవారం నాడు గ్రహణ చంద్రుడిని ఖగోళ వింతల్ని ప్రేమించే వాళ్లు ఆస్వాదించే అవకాశం వస్తోంది. అయితే ఇది రెగ్యులర్ గ్రహణం కాదు. దీనికో ప్రత్యేకత కూడా ఉంది. శుక్రవారం సంభవించేది పెనుంబ్రల్ చంద్ర గ్రహణం. దీని అర్థం ఏంటి? అసలు మనం దీన్ని చూడగలుగుతామా? లేదా తెలుసుకుందాం.

భారత్‌లో కనిపిస్తుందా?

ఈ ఖగోళ అద్భుతం భారత్ సహా పలు ఆసియా దేశాల్లో కనిపిస్తుంది. జవనరి 10న రాత్రి ఇండియాలోకనువిందు చేస్తుంది. ఇక కొన్ని ఆసియా దేశాలు, ఆఫ్రికా, యూరప్, ఆస్ట్రేలియాల్లో 11న కనిపిస్తుంది.

మన దగ్గర టైమ్స్

భారత్‌లో ఈ చంద్ర గ్రహణం శుక్రవారం రాత్రి 10.37 గంటలకు మొదలవుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు గ్రహణం కొనసాగుతుంది. అర్ధరాత్రి దాటి 2.42 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుంది.

ఈ గ్రహణానికి స్పెషాలిటీ..

శుక్రవారం సంభవించేది సంపూర్ణ చంద్ర గ్రహణం కాదు. అలా అని పాక్షిక గ్రహణం కూడా కాదు. ఇది చాలా స్వల్పంగా నీడ పడే ఖగోళ అద్భుతం. చంద్రుడిపై పూర్తిగా భూమి నీడ పడి కనిపించకుండా పోయి మెల్లగా బయటకు వస్తే సంపూర్ణం. ఇది సంభవించినప్పుడు చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారుతాడు. ఇక, సగ భాగం చంద్రుడిపై నీడ పడి.. సగం చంద్రుడు మాత్రమే కనిపించడం  పాక్షిక గ్రహణం. కానీ ఇప్పుడు వచ్చే గ్రహణం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చీ రానట్లుగా ఉంటుంది. చాలా స్వల్పంగా మాత్రమే నీడ పడుతుంది. ఈ రకమైన గ్రహణాన్ని పెనుంబ్రల్ చంద్ర గ్రహణం అంటారు. సంపూర్ణ గ్రహణం కాకుండా మిగిలిన రెండు గ్రహణాల్లో అందమైన చంద్రుడు నల్లగా మారిపోతాడు. ఈ గ్రహణం వచ్చినట్లుగా గుర్తించడం కూడా కష్టమనేనని చెబుతున్నారు సైంటిస్టులు. ఎందుకంటే రెగ్యులర్‌గా ఉన్నదాని కంటే కొంచెం డార్క్‌గా మారుతాడు తప్ప చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోవడమనేది ఉండదు.

చూడొచ్చా?.. లేదా?

నిర్భయంగా ఎటువంటి అపోహలు లేకుండా చంద్ర గ్రహణాన్ని చూడొచ్చని శాస్త్రవేత్తలు, హేతువాదులు చెబుతున్నారు. ఎటువంటి తీవ్రమైన కిరణాలో పడతాయని భ్రమ పడడానికి ఇది సూర్య గ్రహణం అసలే కాదంటున్నారు. చల్లటి చంద్రుడిపై పార్షియల్‌గా నీడ పడడాన్ని నేరుగా రాత్రి 10.37 నుంచి 2.42 వరకు చూడొచ్చు.