
Sukanya Samruddhi Yojana: ఇటీవలి నెలల్లో వరుసగా ద్రవ్యోల్బణం దేశంలో తగ్గుముఖం పట్టడం, రిజర్వు బ్యాంక్ నిర్థేశించుకున్న లక్ష్యాలకు లోబడి ఉండటంతో చాలా కాలంగా తారా స్థాయిల్లో ఉన్న రెపో రేట్లను తగ్గిస్తూ వస్తోంది. అయితే రెపో రేటును సెంట్రల్ బ్యాంక్ తగ్గించటంతో దేశంలోని అనేక బ్యాంకులు తమ డిపాజిట్ రేట్లను కూడా దానికి అనుగుణంగా తగ్గిస్తున్నాయి.
ఇదే క్రమంలో ప్రభుత్వ హామీ కలిగిన చిన్న పొదుపు పథకాలపై కూడా ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది తమ దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా బ్యాంక్స్ అందించే వడ్డీ రేట్ల కంటే వీటిలో పెట్టుబడికే ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయేలా కనిపించటం చిన్న పొదుపు పథకాల్లో డబ్బు పెట్టిన ఇన్వెస్టర్లను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు జూన్ 30న సమీక్షించబడతాయి. కొత్త రేట్లు జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికం నుంచి అమలులోకి వస్తాయి. అయితే ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ కొత్తగా ఈసారి వడ్డీ రేట్ల ప్రకటన సమయంలో వీటిలో మార్పులు రావొచ్చని తెలుస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ప్రస్తుతం 7.10 శాతం వడ్డీని అందిస్తున్నప్పటికీ రానున్న కాలంలో ఇది 7 శాతం కంటే దిగువకు రావొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే అనేక దశాబ్ధాల తర్వాత వడ్డీ రేట్లు 7 శాతం కిందకు పడిపోనుంది.
వాస్తవానికి గోపీనాథ్ కమిటీ చిన్న పొదుపు పథకాలకు సంబంధించిన ఫార్ములాలో, PPF పై వడ్డీ రేటు గత త్రైమాసికంలో సగటు 10 సంవత్సరాల ప్రభుత్వ బాండ్‌పై వచ్చే రాబడి కంటే 25 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంచబడింది. ఏప్రిల్-జూన్ 2025 త్రైమాసికం నుంచి 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్లపై సగటు వడ్డీ రాబడి 6.30%గా ఉన్నందున చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గొచ్చని తెలుస్తోంది. అయితే నిపుణులు మాత్రం గోపీనాథ్ కమిటీ అందించిన సూత్రం కేవలం సూచిక మాత్రమేనని దానిని ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వడ్డీ రేట్లలో భారీ కోతలకు వెళ్లకుండా సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏఏ స్కీమ్స్ కి ఎంత వడ్డీ అందుతోందో ఇప్పుడు చూద్దాం..
* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2
* సుకన్య సమృద్ధి యోజన 8.2
* పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 7.1
* నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7
* కిసాన్ వికాస్ పత్ర 7.5
* పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం 7.4
* పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ పథకం 1-5 సంవత్సరాల వరకు 6.9 నుండి 7.5 శాతం వడ్డీ అందించబడుతోంది
అధిక వడ్డీ ప్రయోజనాలను పొందాలనుకునే వ్యక్తులు ప్రస్తుతం రేట్లలో మార్పులకు మునుపే సేవింగ్స్ చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.