ఆరోగ్య శ్రీ కార్డు కింద.. నిమ్స్ లో లంగ్స్ మార్చిన డాక్టర్లు

ఆరోగ్య శ్రీ కార్డు కింద.. నిమ్స్ లో లంగ్స్ మార్చిన డాక్టర్లు

రాష్ట్రంలో ప్రజారోగ్య రంగంలో వైద్యులు మరో విజయం సాధించారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి వైద్యులు జులై 26న ఆరోగ్య శ్రీ కింద తొలిసారిగా ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ను నిర్వహించి విజయవంతంగా రోగి ప్రాణాలను కాపాడారు. 

వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన 45 ఏళ్ల సీహెచ్ హైమావతి  కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. లంగ్స్​ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయి వాటికి ఆక్సిజన్​ అందకపోవడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. 

ప్యూర్​ ఆక్సిజన్​ కొన్ని నిమిషాలు లేకుండా బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో టెస్టులు.. మందులు వాడిన అనంతరం ఊపిరితిత్తుల మార్పిడి మాత్రమే పేషెంట్​కి సరైందని నిర్ధారణకు వచ్చారు. 

అవయవ దానం.. కాపాడింది ప్రాణం

అదే సమయంలో వరంగల్​కి చెందిన పూజ అనే 16 ఏళ్ల విద్యార్థిని బ్రెయిన్ డెడ్​ అయిందని నిమ్స్​ వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులు ఆమె అవయవాల దానానికి ముందుకొచ్చి మానవత్వం చాటుకున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నిమ్స్ వైద్యులు ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద అదే రోజు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. 

హైమావతి బ్లడ్.. పూజతో సరిపోలడంతో ఊపిరితిత్తుల బాధితురాలికి విజయవంతంగా లంగ్స్ మార్పిడి చేశారు. దీంతో ఈ ఏడాది నిమ్స్‌లో నిర్వహించిన మొత్తం అవయవ మార్పిడి సంఖ్య 27కి చేరింది. 

అవయవ దానానికి బాధిత కుటుంబాలు ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలు రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ విజయంతో నిమ్స్​ డాక్టర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.