V6 News

గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం.. థాయ్‎లాండ్‎లో నిందితులు లూథ్రా బ్రదర్స్ అరెస్ట్

గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో కీలక పరిణామం.. థాయ్‎లాండ్‎లో నిందితులు లూథ్రా బ్రదర్స్ అరెస్ట్

న్యూఢిల్లీ: 25 మంది సజీవ దహనమైన గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులు, బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులు ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన జరిగిన 5 రోజుల తర్వాత థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం వారిని ఇండియా తీసుకురావడానికి గోవా పోలీసు బృందం థాయిలాండ్‌కు వెళుతుంది.

కాగా, నార్త్ గోవా అర్పోరా గ్రామంలోని ‘బిర్చ్‌‌ బై రోమియో లేన్‌‌’ నైట్‌‌క్లబ్‌‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా 25 మంది చనిపోయారు. సిలిండర్‌‌ పేలడం వల్లే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్ర పోలీసులు తొలుత పేర్కొన్నప్పటికీ.. డ్యాన్సింగ్‌‌ రూమ్‌‌లో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు డ్యాన్స్‌‌ ఫ్లోర్‌‌పై సుమారు 100 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గందరగోళం ఏర్పడింది. పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఇరుకుగా ఉన్న ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లగా.. మరికొందరు కిచెన్​లోకి వెళ్లి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు నిప్పంటుకుని కాలిన గాయాలతో చనిపోయారని, మిగతా వారంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందారని అధికారులు తెలిపారు.

 ఈ ఘటన తర్వాత రాత్రికి రాత్రే నైట్‌క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా సోదరులు విదేశాలకు పారిపోయారు. నిందితులు థాయ్ లాండ్‎కు పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు వీరి పాస్ పోర్టులను సస్పెండ్ చేసి వాటిని రద్దు చేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు. అలాగే, లుక్-అవుట్ సర్క్యులర్ జారీ చేశారు.  

మరోవైపు వీరిని గుర్తించి, అప్పగింత ప్రక్రియ పూర్తయ్యే వరకు అదుపులోకి తీసుకోవడంలో సహాయపడటానికి ఇంటర్‌పోల్ వీరిపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఎట్టకేలకు ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత థాయ్ లాండ్‎లోని పుకెట్‎లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగానే.. నిందితులు లూథ్రా బ్రదర్స్  కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‎పై విచారణ సాగుతోంది.