కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తం : రఘుమారెడ్డి

కల్వకుంట్ల కుటుంబానికి బుద్ధి చెప్తం : రఘుమారెడ్డి

ఖైరతాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబానికి  తగిన బుద్ధి చెప్తామని తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక  అధ్యక్షుడు ఎం.రఘుమారెడ్డి హెచ్చరించారు. ఇందుకోసం తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ, తెలంగాణ యూత్ ఫోర్స్  సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబానికి, అమరవీరుల కుటుంబాల మధ్యే పోటీ అని ఆయన అన్నారు. దీన్నుంచి రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ తప్పుకోవాలని రఘుమా రెడ్డి  కోరారు. 

కేసీఆర్ కుటుంబానికి  బుద్ధి చెప్పే శక్తి  అమరుల కుటుంబాలకు మాత్రమే ఉందన్నారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 1,386 మంది చావుకు కారణమైన కేసీఆర్, ఉద్యమంలో అగ్గిపెట్టి నాటకం ఆడిన హరీశ్​ కు, ఉద్యమకారులను  రెచ్చగొట్టిన  కేటీఆర్ కు తప్పకుండా గుణపాఠం చెప్తామన్నారు. తెలంగాణ  అమరుల ఆశయ సాధన యాత్ర ద్వారా గత 20 రోజులుగా గజ్వేల్ నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతూ కల్వకుంట్ల కుటుంబ అరాచకాలను ప్రజలకు వివరించి చెప్తున్నామన్నారు. ఈ నెల 8 నుంచి కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పర్యటించి.. వారు రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. 

అలాగే, వారి​కుటుంబాన్ని ఓడించేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్​ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో 200 మందితో నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి నియోజవర్గాల్లో  9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వరకు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని.. 1,386 మంది  తెలంగాణ అమరవీరులను గుర్తించి.. వారికి రూ.50 లక్షల ఆర్థిక సహాయం, గ్రూప్ 2  స్థాయికి తగ్గకుండా ప్రభుత్వ ఉద్యోగం,  పది ఎకరాల  వ్యవసాయ భూమి,  ఉద్యమంలో పోరాటం చేసి అంగవైకల్యం చెందిన  175 మందిని గుర్తించి ఆర్థిక సహాయంతో పాటు  ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్​చేశారు.