మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

75వ స్వాతంత్ర్య వేడుకలు ఉమ్మడి పాలమూరులో అంబరాన్ని తాకాయి.  స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ, పార్టీ ఆఫీసులు, కోర్టుల్లో జెండా వందనం చేశారు.  రోడ్లపై వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలు తీశారు.  జిల్లా కేంద్రాల్లోని పరేడ్ గ్రౌండ్లలో  చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి.  ప్రభుత్వ శాఖలకు సబంధించిన శకటాలు, స్టాళ్లు  ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్‌‌ పరేడ్ గ్రౌండ్‌లో ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, నారాయణపేటలో రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ సునీతా లక్ష్మారెడ్డి, నాగర్‌‌ కర్నూల్‌లో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, గద్వాలలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ చీఫ్‌ గెస్టులుగా పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించడంతో పాటు ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు ఇచ్చారు. అలాగే స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలను సన్మానించారు.  

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నారాయణపేట, వెలుగు: మహిళలు అన్ని  రంగాల్లో రాణించాలని రాష్ట్ర మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.  సోమవారం కలెక్టరేట్​ప్రాంగణంలో ఆరుణ్య బ్రాండ్​ టీ స్టాల్​ , ఉత్పత్తుల విక్రయ కేంద్రన్ని కలెక్టర్​ హరిచందనతో కలిసి ప్రారంభించారు.  మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులను ‘ఆరుణ్య’ బ్రాండ్‌తో మార్కెట్‌లో విక్రయిస్తున్నామని కలెక్టర్‌‌ వివరించారు.  అనంతరం సునీతా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంక్షేమం అనే కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు.   నారాయణపేట నాణ్యమైన చిరలకు ప్రసిద్ధి గాంచిందని, ఈ బ్రాండ్‌ను ఇలాగే కొనసాగించాలని సూచించారు.  అడిషనల్ కలెక్టర్​ పద్మజారాణి, డీఆర్డీవో గోపాల్​ నాయక్​, సెరా ట్రస్ట్​ చైర్మన్​ సింధియా  ఉన్నారు.

రాళ్ల దాడి చేయడం సిగ్గుచేటు

మక్తల్, వెలుగు:  బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రపై టీఆర్‌ఎస్‌ గుండాలు రాళ్లదాడి చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు.  జనగామ జిల్లా దేవరుప్పులలో పాదయాత్ర చేస్తున్న బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌, బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా ఉమ్మడిజిల్లాలో పలుచోట్ల సీఎం కేసీఆర్‌‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.  నారాయణపేట, గద్వాల అధ్యక్షులు పగుడాల శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, సినీయర్‌‌ నేతలు నాగురావునామాజీ, కొండయ్య,  రతంగ్ పాండ్ మాట్లాడుతూ బండి సంజయ్​పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే టీఆర్‌‌ఎస్‌ గుండాలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్​, మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.  పోలీసులకు దాడి జరుగుతుందని సమాచారం ఉన్నా పట్టించుకోలేదని, అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు.   దాడి చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.   

కత్వవాగుపై బ్రిడ్జి నిర్మించాలి

అమనగల్లు,వెలుగు: ఆమనగల్లు మండలం మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండాల మధ్య ఉన్న రోడ్డుపై నుంచి పారుతున్న కత్వవాగుపై బ్రిడ్జి నిర్మించాలని ఆయా తండా వాసులు డిమాండ్ చేశారు. సోమవారం వాగులో నిల్చుని నిరసన తెలిపారు.  బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిరుడు రూ. 3.10 కోట్లు మంజూరు చేయగా అధికార పార్టీకి చెందిన వ్యక్తి కాంట్రాక్ట్‌ తీసుకున్నాడని చెప్పారు. ఆయన పనులు చేపట్టకపోవడంతో వాగు వచ్చినప్పుడల్లా మేడిగడ్డ, శంకర్ కొండ, దయ్యాల భోడ్, సామాయపల్లి తండాలకు రాకపోకలు బంద్ అవుతున్నాయని వాపోయారు.   ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. సర్పంచులు అంబర్ సింగ్, లచ్చిశంకర్, ఉప సర్పంచ్ ప్రశాంత్, వైయస్సార్సీపి తాలూకా ఇన్చార్జ్ అర్జున్ రెడ్డి, వార్డు సభ్యులు పాండు, లక్ష్మణ్, చందు పాల్గొన్నారు.

‘ఇండియన్ ఆర్మీ’ సాంగ్ రిలీజ్

వనపర్తి టౌన్, వెలుగు: స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా  నేటి లీడర్ మీడియా  వారు దేశ సైనికుల త్యాగంపై రూపొందించిన పాటను  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రిలీజ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా,  అడిషనల్ ఎస్పీ షాకీర్ హుస్సేన్‌ పాల్గొన్నారు.  అంతకుముందు మంత్రి వనపర్తిలోని పానగల్ రోడ్డులో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని  ప్రారంభించారు.

గాంధీ, అంబేద్కర్‌‌ను అవమానించిన్రు

చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల ఫిర్యాదు

మక్తల్, వెలుగు:  మక్తల్‌ పట్టణంలోని కాలేజీ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన వజ్రోత్సవాల్లో మహత్మా గాంధీ, డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్‌‌ను అవమానించారని దళిత మోర్చా నేత కొలిమి అంజనేయులు,  బీజేపీ నేతలు బలరాంరెడ్డి, మల్లికార్జున్​ ఆరోపించారు. సోమవారం మక్తల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జానపద కళాకారుల ప్రదర్శన సందర్భంగా వేదికపైన ఉన్న  గాంధీ,  అంబేద్కర్, భారతమాత ఫొటోలను నేలపై పెట్టారని మండిపడ్డారు.  నిర్వహకులపైచర్యలు తీసుకోవాలని  డిమాండ్​ చేశారు.  ఈకార్యక్రమంలో బీజేపీ నేతలు నర్సింహా రెడ్డి, కల్లూరి నాగప్ప, రాజశేఖర్​ రెడ్డి, రహిం పాష, దళిత మోర్చా మండల ప్రెసిడెంట్​చెన్నప్ప, రాములు,  బుగ్గన్న తదితరులు పాల్గొన్నారు.

స్కూల్‌కు రిటైర్డ్‌ జవాన్ రూ. లక్ష విరాళం

గండీడ్, వెలుగు:  గండీడ్ మండలం రంగారెడ్డి పల్లికి చెందిన రిటైర్డ్ జవాన్ బాలకృష్ణ స్వగ్రామంలోని ప్రైమరీ స్కూల్‌కు రూ. లక్ష  విరాళం ఇచ్చారు.  సోమవారం 75 స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న ఆయన స్కూళ్ల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సూచించారు.    గ్రామ సర్పంచ్  లక్ష్మీదేవమ్మ, హెచ్‌ఎం బాలజారు ఆయనను అభినందించారు. 

కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ పోరాటంతోనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి స్పష్టం చేశారు.  ఆజాదీ కా గౌరవ్ యాత్రలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా నుంచి కాంగ్రెస్ కార్యాలయం వరకు నడిచారు. అనంతరం సాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లురవి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్న పార్టీలు స్వలాభం కోసం పనిచేస్తున్నాయే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.  రాష్ట్రంలో పంట నష్ట పరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,  దళితులకు మూడెకరాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దయనీయంగా ఉందని వాపోయారు.  ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జి నాగం శశిధర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, నేతలు పాండు, లక్ష్మయ్య, నారాయణ గౌడ్, మల్లయ్య గౌడ్, అహ్మద్ పాషా, సలీం పాల్గొన్నారు.  

వీఆర్ఏల సమస్యలపై సీఎస్‌కు లెటర్‌‌ రాస్త

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాయనున్నట్లు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు.  నాగర్ కర్నూల్ తహసీల్దార్‌‌ ఆఫీస్ ముందు  సమ్మె చేస్తున్న వీఆర్వోలకు సోమవారం మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  సీఎం ఇచ్చిన హామీ మేరకు వీఆర్ఏలకు పేస్కేల్ వర్తింపజేయాలని, వారసులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.   

పంద్రాగస్టు వేడుకలు జరపనివ్వని కమిషనర్

పెబ్బేరు, వెలుగు :  పెబ్బేరు పట్టణంలోని అంబేద్కర్​ పార్కులో అంబేద్కర్​ విగ్రహం వద్ద మున్సిపల్ కమిషనర్‌‌  పంద్రాగస్టు వేడుకలు జరపనివ్వడం లేదని యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు. సోమవారం కొల్లాపూర్​ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి కమిషనర్‌‌ సస్పెండ్​ చేయాలని నినాదాలు చేశారు. వెంటనే పార్కును తెరవాలని 
డిమాండ్​ చేశారు. దాదాపు గంటపాటు ధర్నా చేయడంతో ఫుల్ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.  ఎస్సై రామస్వామి జోక్యం చేసుకొని మున్సిపల్​ కమిషనర్​లో ఫోన్‌లో మాట్లాడి పార్కు తాళం తెరిచి జెండావిష్కరణ జరిగేలా చూశారు.  ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, రంజిత్​, విజయ్​ వర్ధన్​రెడ్డి, అఫ్రోజ్​, అశోక్​, శివ పాల్గొన్నారు.