మొదలైన ‘మా’ ఎన్నికలు.. మోహన్‎బాబు, ప్రకాశ్ రాజ్‎ల మధ్య ఆసక్తికర సన్నివేశం

మొదలైన ‘మా’ ఎన్నికలు.. మోహన్‎బాబు, ప్రకాశ్ రాజ్‎ల మధ్య ఆసక్తికర సన్నివేశం

‘మా’ ఎన్నికల సమరం మొదలైంది. గత రెండు నెలల నుంచి పోటీదారులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఫైనల్‎గా ఈ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‎లో జరుగుతున్నాయి. ఉదయం ఎనమిదింటికి ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రి 8 గంటలలోపు ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి ఎన్నడూ లేని విధంగా ‘మా’ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు.. మా అధ్యక్ష పదవి కోసం పోటిపడుతున్నారు. 

కాగా.. ఓటువేయడానికి మోహన్ బాబు విష్ణుతో కలిసి వచ్చారు. అదే సమయంలో తారసపడ్డ ప్రకాశ్ రాజ్.. మోహన్ బాబు కాళ్లకు నమస్కరించబోయాడు. వెంటనే మోహన్ బాబు.. ప్రకాశ్ రాజ్‎ను ఆపి.. ఆలింగనం చేసుకున్నాడు. కాగా.. ఇప్పటికే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రాంచరణ్, చిరంజీవి, సాయికుమార్, ఆది, తనికెళ్లభరణి,హేమ, మంచు మనోజ్లు తమ ఓటును వినియోగించుకున్నారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్  కార్యవర్గాన్ని రెండేళ్లకొకసారి ఎన్నుకుంటారు. అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మంది బరిలో ఉన్నారు. మా ఎన్నికల్లో ఒక్కో ఓటరు మొత్తం 26 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల్లో వేర్వేరు ప్యానెల్స్‎లో పోటీ చేసిన అభ్యర్థులు గెలిచాక ఒకే ప్యానెల్‎గా మారుతారు. అధ్యక్షుడిగా ఎవరైతే గెలుస్తారో అతని ఆధ్వర్యంలో మిగతా సభ్యులు పనిచేయాల్సి ఉంటుంది.

గతంలో 2015లో రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడ్డారు. రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2019 టర్మ్‌కు శివాజీరాజాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019 నుంచి 2021 టర్మ్‌కు జరిగిన ఎన్నికల్లో శివాజీరాజా, నరేశ్‎లు అధ్యక్ష పదవి కోసం పోటీపడగా.. 69 ఓట్ల మెజార్టీతో నరేశ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అయితే గతంతో పోలిస్తే.. ఈసారి ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. వాడీవేడీగా ఆరోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారం సాగింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావులు నామినేషన్లు వేశారు. ఆ తర్వాత నరసింహారావు విత్ డ్రా చేసుకున్నారు. ప్రస్తుతం ‘మా’లో మొత్తం 925మంది సభ్యులుండగా.. వారిలో 883 మందికి ఓటు హక్కు ఉంది. 

For More News..

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు