రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు

రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వానలు
  • నిన్న రాత్రి మరోసారి ఉరుములు, మెరుపులతో కుండపోత
  • పొంగిపొర్లిన చెరువులు.. లోతట్టు ప్రాంతాల మునక
  • ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయిన జనం
  • రోడ్లపై నిలిచిన నీళ్లు.. భారీగా ట్రాఫిక్ జామ్
  • సికింద్రాబాద్‌‌లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్ల వాన

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌‌లో రెండో రోజూ వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. శుక్రవారం పడిన వర్షం నుంచి తేరుకోకముందే.. శనివారం మరోసారి కుండపోత కురవడంతో వరద ఉప్పొంగింది. నగరంలోని ప్రధాన రోడ్లు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇండ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. రోడ్లపై నీళ్లు నిలవడంతో సిటీ అంతటా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 

సికింద్రాబాద్‌‌లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్లు, బేగంపేటలో 8.6, ఫిరోజ్‌‌గూడలో 7.1, ఆదిలాబాద్‌‌లోని బజర్‌‌హత్నూర్‌‌లో 4.7, రంగారెడ్డిలోని ఎల్‌‌బీ నగర్‌‌లో 4.6 సెం.మీ. వర్షపాతం రికార్డయ్యింది. రాష్ట్రంలో పలుచోట్ల మరో నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌‌ ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల జనాలు ఆందోళన చెందుతున్నారు.

జంట జలాశయాలకు భారీ వరద

వికారాబాద్ జిల్లాలో 8 సెంటీమీటర్ల మేర కురిసిన వానతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లోకి భారీగా వరద నీరు చేరుతున్నది. దీంతో ఉస్మాన్ సాగర్ 4 గేట్లు, హిమాయత్ సాగర్ 6 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి 5,600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మూసారాం బాగ్ బ్రిడ్జి మీదుగా వరద నీరు పారుతున్నది. దిల్ సుఖ్ నగర్ నుంచి కోఠి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పొంగిపొర్లిన చెరువులు

ఇప్పటికే నిండుకున్న చెరువుల నుంచి వరద నీరు పోటెత్తడంతో చుట్టుపక్క కాలనీలు జలమయమయ్యాయి. దిల్ సుఖ్ నగర్‌‌‌‌లోని శివగంగ థియేటర్‌‌‌‌లోకి వరద నీరు ముంచెత్తింది. హాల్ పార్కింగ్ గోడ కూలి 15కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. గగన్ పహాడ్ అప్పా చెరువు నిండి కర్నూల్ హైవే మీదుగా ప్రవహించడంతో అధికారులు రోడ్డుపై రాకపోకలు నిలిపివేశారు. ఎల్బీ నగర్ జోన్ పరిధిలోని పెద్ద చెరువు, సంద చెరువు, చిన్న చెరువుల నుంచి సరూర్ నగర్ చెరువులోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో అడుగున ఉన్న పీ అండ్ టీ కాలనీ, కోదండరాం నగర్ కాలనీ, చైతన్య పురి, లింగోజీగూడ, సీసాలగల్లీ ప్రాంతాల్లో మోకాళ్ల ఎత్తున వరద నీరు ప్రవహించింది. మిథిలా నగర్ లో నడుము లోతున వరద ప్రవహించింది. హయత్ నగర్ లోని బంజారా కాలనీ, బస్తీలన్నీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి.

500కు పైగా కాలనీలకు వరదముప్పు

ఎల్బీనగర్, దిల్ సుఖ్‌‌ నగర్, మలక్ పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నారాయణగూడ, నాంపల్లి, ఎంజే మార్కెట్, బేగంపేట్, పాటి గడ్డ, ఆనంద్ బాగ్, ఆఫ్జల్ గంజ్, లింగోజిగూడ, రెయిన్ బజార్, మెట్టుగూడ, సికింద్రాబాద్, సరూర్ నగర్, ముషీరాబాద్, చార్మినార్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. దీంతో చాలా కాలనీలు, బస్తీలు నీట మునిగాయి. సిటీలో దాదాపు 500కు పైగా కాలనీలు, బస్తీలకు వరద ముంపు పొంచి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. కోదండరాం కాలనీ వాసులను స్థానిక కమ్యూనిటీ హాల్‌‌కు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బలగాలు బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాయి. రెండు రోజులుగా వరద నీటిలోనే ఉన్న హయత్ నగర్ బంజారా కాలనీలో బల్దియా సిబ్బంది ఫుడ్ సప్లై చేశారు. 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని వార్తల కోసం..

పండుగపూట జర భద్రం: కేంద్ర మంత్రి అలర్ట్

టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు