
- శనివారం విచారణకు హాజరైన మిశ్రా
- ఉదయం నుంచి 12 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
లఖీంపూర్ ఖేరి: లఖీంపూర్ హింస కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీష్‌ను యూపీ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. విచారణకు సహకరించలేదని, సరైన సమాధానాలు ఇవ్వలేదని చెప్పారు. కేసు విచారణలో భాగంగా శనివారం ఉదయం ఆశీష్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఆయనను సిట్ బృందం దాదాపు 12 గంటల పాటు విచారించింది. రైతుల పైనుంచి వాహనం దూసుకెళ్లిన సంఘటనపై అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. ప్రమాదానికి కారణమైన కారులో తాను లేనని ఆశీష్ చెప్పడంతో ఆ సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. అయితే, దీనికి ఆశీష్ పొంతనలేని సమాధానాలు
చెప్పినట్లు సమాచారం.
కుట్ర ప్రకారమే దాడి: రైతులు
లఖీంపూర్‌లో ఆందోళన చేస్తున్న రైతులపైకి ముందస్తు కుట్ర ప్రకారమే వాహనాన్ని ఎక్కించారని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన కేంద్ర సహాయక మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని సంయుక్త్ కిసాన్ మోర్చా లీడర్ యోగేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. నిందితులను రక్షించేందుకు కేంద్ర మంత్రి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
డీఐజీ ఆధ్వర్యంలోని సిట్ విచారణ
ఆశిష్ మిశ్రాను డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ విచారించింది. ఇదే సమయంలో స్థానిక బీజేపీ ఆఫీసులో లాయర్లతో కలిసి అజయ్ మిశ్రా వెయిట్ చేశారు. విచారణకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆశిష్ మిశ్రాకు పోలీసులు గురువారమే నోటీసులివ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో శుక్రవారం మరోసారి ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. శనివారం జరిగే విచారణకు కచ్చితంగా హాజరుకావాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.