OTTలో ట్రెండ్ అవుతున్న దివంగత పునీత్ రాజ్ కుమార్ థ్రిల్లర్ సిరీస్.. అప్పును చూసి అభిమానులు భావోద్వేగం!

OTTలో ట్రెండ్ అవుతున్న దివంగత పునీత్ రాజ్ కుమార్ థ్రిల్లర్ సిరీస్.. అప్పును చూసి అభిమానులు భావోద్వేగం!

ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ కన్నడ వెబ్ సిరీస్ 'మారిగల్లు' (Maarigallu). శుక్రవారం అక్టోబర్ 31, 2025న ZEE5లో స్ట్రీమింగ్ కి వచ్చింది. 1500 ఏళ్ల కిందటి రాజవంశానికి చెందిన నిధి వేట అనే కాన్సెప్ట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది. దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ బ్యానర్ నుంచి వస్తున్న మొదటి కన్నడ వెబ్ సిరీస్ ఇది.

మత్స్యగంధ' ఫేమ్ దేవరాజ్ పూజారి దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో ప్రవీణ్ తేజ్, ప్రశాంత్ సిద్ధ, రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్ పాండే, నినాద్ కీలక పాత్రలు పోషించారు. దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ని మళ్ళీ  తెరపై చూస్తుండటంతో.. కన్నడ సినీ ఆడియన్స్ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో 6 ఎపిసోడ్‌లుగా స్ట్రీమ్ అవుతున్న ఈ  సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. 

కథేంటంటే:

కర్నాటకలో సిర్సి దగ్గర్లోని ఒక చిన్న  గ్రామంలో 1990లలో జరిగిన కథగా ఈ వెబ్‌‌ సిరీస్‌‌ తెరకెక్కింది. కథలోకి వెళ్తే.. ఆ గ్రామాన్ని గతంలో కదంబ రాజవంశం పాలించేది. అప్పటి రాజులు పెద్ద మొత్తంలో నిధులను సేకరించి ఒకచోట దాచిపెట్టారని ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. అందుకే నిధి కోసం వెతుకుతూ వెళ్లిన వాళ్లు చనిపోతారని చెప్తుంటారు.

అయితే.. కదంబ వంశానికి చెందిన అశోక శర్మ (గోపాలకృష్ణ దేశ్‌‌పాండే) ఆ నిధికి సంబంధించిన పురాతన రాతి శాసనాలను సేకరిస్తాడు. వాటి ద్వారా నిధి దగ్గరకు చేరుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. మరోవైపు పురావస్తు శాఖ అధికారి మారి గౌడ (రంగాయణ రఘు) కూడా ఆ సంపదను కనుగొనేందుకు బయల్దేరుతాడు. అందుకోసం అతని ఫ్రెండ్‌‌ వరద (ప్రవీణ్ తేజ్)తో పాటు మరి కొంతమంది యువకుల సాయం తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ నిధి వీళ్లలో ఎవరికైనా దొరికిందా? లేదా? అనేది సిరీస్‌‌ చూసి తెలుసుకోవాలి.

మా దేవుడిని మళ్లీ చూడగలుగుతున్నాం

దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్ చిన్న కుమారుడైన పునీత్ రాజ్‌కుమార్ 46 ఏళ్లకే (అక్టోబర్ 29, 2021న) గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆయన చివరి సినిమాలు 'జేమ్స్', 'లక్కీ మ్యాన్'  మరణానంతరం విడుదలయ్యాయి. ఆయన వారసత్వాన్ని గౌరవించడంలో భాగంగా 'మారిగల్లు'లో పునీత్‌ను AI-జనరేటెడ్ యానిమేటెడ్ రూపంలో చూపించారు. ఈ క్రమంలో "అప్పు బాస్ ఎంట్రీ! కింగ్ ఈజ్ బ్యాక్! లవ్ యూ అప్పు" అని మరికొందరు స్పందించారు. మా దేవుడిని మళ్లీ చూడగలుగుతాం అంటూ అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.