డిపాజిట్ గల్లంతు కాకుండా చూసుకో : మదన్​మోహన్

డిపాజిట్ గల్లంతు కాకుండా చూసుకో : మదన్​మోహన్

ఎల్లారెడ్డి (గాంధారి), వెలుగు: కమీషన్లకు కక్కుర్తి పడి ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విసర్మించిన ఎమ్మెల్యే సురేందర్ కు ఈ ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​ మోహన్​ పేర్కొన్నారు. స్వలాభం కోసం పార్టీ మారి, ఇప్పుడు మళ్లీ ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగడానికి వెళ్తున్నారంటూ నిలదీశారు. శనివారం ఆయన గాంధారి మండల కేంద్రంతో పాటు చద్మల్, నాగులూరు తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూపాయి జీతం తీసుకొని ప్రజలకు సేవ చేస్తానన్నారు. మిగతా మొత్తాన్ని ప్రజల సంక్షేమం కోసమే వినియోగిస్తానని చెప్పారు. కరోనా టైమ్​లో నియోజకవర్గంలో అంబులెన్స్​లు ఏర్పాటు చేశానని, ఇతర వైద్య సౌకర్యాలు కల్పించి ప్రజలకు అండగా నిలబడ్డానన్నారు. గడిచిన అయిదేండ్లలో జాజాల సురేందర్​ నియోజకవర్గంలో రూపాయి పనిచేయలేదని, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్నారు.

ఎల్లారెడ్డి ఉద్యమ గడ్డ, ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు, వారికి మేలు చేసే నాయకున్నే ఎన్నుకుంటారనే ధీమా ఉందన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. నగులూరులో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్​ లీడర్లు మేం రాగానే పారిపోయారని, అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తారనే భయం వారిలో ఉందన్నారు. ఈ సందర్భంగా అనేక మంది బీఆర్ఎస్ ​లీడర్లు కాంగ్రెస్​లో చేరారు. వారికి మదన్​మోహన్​ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు నాగం గోపి కృష్ణ, కుర్మ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.