
- వాట్సాప్‌కు పోటీగా మేడిన్ ఇండియా ఆరట్టై
- సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్
- రోజూ సగటున 4 లక్షల డౌన్లోడ్లు
- ఈ నెల 3 నాటికి 75 లక్షలు దాటిన యూజర్స్
- యాప్‌ను రూపొందించిన తమిళనాడుకు చెందిన జోహో సంస్థ
- సెప్టెంబర్ 22న ఐఫోన్, 28న ఆండ్రాయిడ్ వెర్షన్ రిలీజ్
- మారుమూల పల్లెల్లో నెట్ సరిగ్గా లేకున్నా వాడుకునే సౌకర్యం
- వాట్సాప్లో లేని ‘ఆండ్రాయిడ్ టీవీ’ ఫీచర్ కూడా
- జూమ్ తరహా మీటింగ్‌లూ నిర్వహించుకునే వెసులుబాటు
హైదరాబాద్, వెలుగు: వాట్సాప్‌కు గట్టిపోటీనిచ్చే మేడిన్ ఇండియా యాప్ వచ్చేసింది. వచ్చిన కొద్దిరోజుల్లోనే ఇటు ఆండ్రాయిడ్.. అటు యాపిల్ ఫోన్లలో నెంబర్ వన్ మెసేజింగ్యాప్గా రికార్డులకెక్కింది. ఆ యాప్ పేరు ఆరట్టై. అంటే ‘ముచ్చట లేదా మాట్లాడుకోవడం’ అని అర్థం. పూర్తిగా మన దేశీ చాటింగ్ యాప్ అది.
తమిళనాడుకు చెందిన జోహో అనే సంస్థ ఈ యాప్‌ను రూపొందించింది. వాస్తవానికి ఇది 2021 జనవరిలోనే సైలెంట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. అంతగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ, దానికి మరిన్ని హంగులు అద్ది.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మళ్లీ కొత్తగా లాంచ్ చేశారు. తొలుత యాపిల్ ఫోన్లలోకే ఇది ఎంట్రీ ఇవ్వడం విశేషం.
గత నెల 22న యాపిల్ వెర్షన్ ఆరట్టైని లాంచ్ చేయగా.. ఆండ్రాయిడ్ వెర్షన్‌ను 28న సరికొత్తగా తీసుకొచ్చారు. అలా కొద్దిరోజుల్లోనే ఈ నెల 3 నాటికే 75 లక్షల మందికిపైగా ఆరట్టై యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యూజర్లుగా మారిపోయారు. ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచే డౌన్‌లోడ్స్ ఉండడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లలో 50 లక్షల మందికిపైగా, యాపిల్ యూజర్లు 25 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను ఇప్పటివరకూ డౌన్‌లోడ్ చేశారు. అయితే, ఈ రెండు రోజులు కూడా కలుపుకుంటే.. మరో 10 లక్షల మంది కూడా యాడ్ అయి ఉంటారని చెబుతున్నారు. తొలుత ఓ వారంపాటు రోజూ 3 వేల డౌన్‌లోడ్స్ ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య రోజూ సగటున 4 లక్షలకుపైగానే ఉంటున్నది.
ఎందుకంత క్రేజ్..
వాట్సాప్‌కు పోటీగా స్నాప్ చాట్, టెలిగ్రామ్‌లాంటి యాప్స్ వచ్చినా.. వాట్సాప్‌ను మాత్రం దాటి ముందుకు వెళ్లలేకపోయాయి. కానీ, ఆరట్టై మాత్రం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది. వాట్సాప్ సహా మిగతా అన్ని మెసేజింగ్ యాప్‌లను తలదన్ని ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో నెంబర్‌వన్ యాప్‌గా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ఉన్న మెసేజింగ్యాప్స్లలో లేని సౌలతులు, ఫీచర్లు ఇందులో ఉండడం వల్లే ఇంతలా క్రేజ్ వచ్చిందని టెక్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
వాట్సాప్ లాంటి మెసేజింగ్యాప్స్ను వాడాలంటే నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి. అలాగే నెట్ క్వాలిటీ ఉండాలి. అది కూడా పాత వెర్షన్ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో పని చేయదు. మారుమూల ప్రాంతాల్లో చాలా మందికి అడ్వాన్స్‌డ్ ఫోన్లు ఉండడం లేదు. దీంతో చాలా మంది ఈ మెసేజింగ్ యాప్‌తో గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్‌నే ఆరట్టై భర్తీ చేస్తున్నది. మామూలు వెర్షన్, బడ్జెట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ పనిచేసేలా ఆరట్టైని జోహో రూపొందించింది.
దీనిని వాడేందుకు 5జీ లేదా 4జీ నెట్ కూడా అవసరం లేదు. నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఫొటోలు, డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా.. సెండ్ చేయాలన్నా డేటా అవసరం కూడా పెద్దగా ఉండదు. లో కనెక్టివిటీలోనూ వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే, డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉన్నది.
ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్..
వాట్సాప్, టెలిగ్రామ్‌లోలేని ఒక యూనిక్ ఫీచర్ కూడా ఆరట్టై వైపు యూజర్లను ఆకర్షించేలా చేసింది. అదే ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్. ఇప్పటివరకు వాట్సాప్లో కేవలం వెబ్ బ్రౌజర్‌కు కనెక్ట్ చేసుకునేందుకే అవకాశం ఉంది. కానీ, ఆరట్టైలో మాత్రం టీవీకి కూడా కనెక్ట్ చేసుకునేలా అదనపు ఫీచర్‌ను జోడించారు.
‘ఆండ్రాయిడ్ టీవీ’ ఆప్షన్‌ను ఇచ్చి నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకునేలా హంగులు అద్దారు. ఆండ్రాయిడ్ ఫోన్లతోపాటు యాపిల్ ఫోన్లలోనూ ఈ సౌకర్యం ఉండడం ప్లస్ పాయింట్‌గా మారింది. ఇటు ఈ మెసేజింగ్ యాప్‌లోనే జూమ్ తరహా మీటింగ్‌లనూ నిర్వహించుకునే మరో ఆప్షన్‌కూడా ఉంది. ఇప్పటిదాకా వాట్సాప్‌సహా ఏ మెసేజింగ్యాప్లోనూ ఈ ఫీచర్ లేదు.
జోహో నుంచి మరిన్ని దేశీ ప్రొడక్ట్స్
జోహో సంస్థ ఒక్క ఆరట్టై కాదు.. మరిన్ని ప్రొడక్టులనూ తీసుకొచ్చింది. జోహో ఉలా, జోహో మెయిల్, బాస్ ఓఎస్, ఇండస్ యాప్‌స్టోర్ లాంటి మరిన్ని ప్రొడక్టులను అభివృద్ధి చేసింది. మన దేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరట్టైతోపాటు వీటిని రూపొందించింది. ప్రైవసీకి కూడా పెద్దపీట వేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అత్యంత కట్టుదిట్టంగా డెవలప్ చేసింది. దేశంలోని అన్ని భాషలనూ సపోర్ట్ చేసేలా యాప్‌ను రూపొందించింది. ఇంటర్నేషనల్ సంస్థలకు ఏ మాత్రం తీసిపోకుండా వీటిని ఆ సంస్థ తయారు చేయడం విశేషం.
మరికొన్ని ప్రొడక్ట్స్ ఇవే..
జోహో ఉలా: ఇది గూగుల్, గూగుల్ క్రోమ్, సఫారీల్లాగా ఒక బ్రౌజర్. డెస్క్‌టాప్, మొబైల్ వెర్షన్లలో ఈ బ్రౌజర్‌ను తీసుకొచ్చింది. డిఫరెంట్ఆన్లైన్యాక్టివిటీస్కు వివిధ మోడ్స్‌తో దీనికి రూపకల్పన చేసింది.
జోహో షూట్: మామూలుగా మైక్రోసాఫ్ట్‌లో వర్డ్, ఎక్సెల్, మెయిల్‌లాంటి వాటిని ఇస్తుంటారు. జోహో కూడా సొంతంగా అలాంటి వాటిని తీసుకొచ్చింది. జోహో మెయిల్, వర్క్ డ్రైవ్ (స్టోరేజ్), షో, రైటర్, షీట్స్, మీటింగ్, ఫామ్స్, క్యాలెండర్‌లాంటి వాటిని అభివృద్ధి చేసింది. ఇందులో బేసిక్ ఫ్రీ యాక్సెస్‌తోపాటు సబ్‌స్క్రిప్షన్‌తోనూ వాడుకునే వెసులుబాటు కల్పిస్తున్నది.
బాస్ ఓఎస్: ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఓఎస్(విండోస్), మ్యాక్ ఓఎస్‌నే చాలా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో వాడుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా దేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను జోహో డెవలప్ చేసింది. ‘భారత్ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్’ (బాస్ ఓఎస్) పేరిట దీన్ని అభివృద్ధి చేసింది. మన దేశ భాషలను సపోర్ట్ చేసేలా రూపొందించిన ఈ ఓఎస్‌ను సంస్థ ఫ్రీగా అందిస్తున్నది.
ఇండస్ యాప్ స్టోర్: ప్లేస్టోర్‌కు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ డౌన్‌లోడ్ ప్లాట్‌ఫాం ఇది. 12 భాషలను సపోర్ట్ చేస్తుంది. యూజర్లు, డెవలపర్లకు ఫ్రీ యాక్సెస్‌ను కల్పిస్తున్నారు.